మనిషి అపార బుద్ధి సంపన్నుడు. ఇది దైవం నుంచే జన్మతః సంక్రమించిన ఆస్తి. అది బుర్రలో నిక్షిప్తమైన అక్షయపాత్ర.
మనిషి కోరికలు అనేకం. రక్తబీజుడు అనే రాక్షసుణ్ని దేవి సంహరిస్తుంటే, అతడి దేహం నుంచి జారిపడే ఒక్కొక్క రక్తపుబొట్టు నుంచి ఒక్కొక్క రాక్షసుడు పుట్టేవాడట. కోరికలు కూడా ఇంతే. అవి పెరిగేవే కాని, ఎప్పటికీ తరగవు. మనిషి
అపర కురుక్షేత్రం
ముందున్న మంచి చెడు అనే రెండు విభిన్న మార్గాల్లోనూ ఇవి ప్రత్యక్షమవుతాయి. కోరికలను పొందేందుకు కావలసిన ఇంద్రియ శక్తులనే వనరులను దేహంలో సిద్ధం చేసిన దైవం, కోరికల ఎంపిక విషయంలో స్వేచ్చను మాత్రం మనిషికే వదిలాడు. ఇది మనిషికి పెద్ద సవాలయింది. ఇంద్రియాల పోరుకు ఈ దేహమే కురుక్షేత్రం అనే రంగస్థలమయింది. కురులంటే ఇంద్రియాలు, క్షేత్రమంటే దేహం. ఇంద్రియ శక్తులే యుద్ధ వీరులు. ఈ పోరులో గెలుపునకు ధర్మమే దివ్యాయుధమని మహాభారత మూల సందేశం. మనసును ధర్మంతో నింపితే చాలు. దైవం ఇచ్చిన బుద్ధిశక్తి ప్రచోదయమై, మహాపరాక్రమంతో పోరాడి ఇంద్రియశక్తులపై విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ధర్మమంటే నిస్వార్థంగా, పరోపకార బుద్ధితో, ఇతరుల మనసును గాయపరచకుండా మాట్లాడటం, ఎవరికీ హాని తలపెట్టకుండా హాయిగా ఆనందంగా జీవించడం. చెప్పడానికిది సులభంగానే ఉన్నా, ఆచరణలో కష్టసాధ్యం. ఇంద్రియాలకు రాజైన యుధిష్ఠిరుడనే మనసును ధర్మం అనే అస్త్రంతో లొంగదీస్తే, మిగిలిన ఇంద్రియ శక్తులు వశమై ధర్మాచరణకు సహకరిస్తాయి. అర్జునుడు అనే బుద్ధిశక్తి, భీమసేనుడనే దేహశక్తి, నకులసహదేవులు అనే అంగశక్తులు, ధర్మరాజు అనే మనసు మాట జవదాటవు. శ్రీకృష్ణుడు అనే మనిషిలోని దివ్యశక్తి, ముందుండి మరీ నడిపిస్తుంది.
ధర్మాచరణకు పూనుకొన్న మనసుకు ద్రౌపది అనే ప్రాణశక్తి తోడై, ఈ బాహ్యాంతరేంద్రియాలను సమైక్యం చేసి, ఉత్తేజపరచి మరింత శక్తితో లక్ష్యంపై దాడికి పురిగొల్పుతుంది. కురువీరులనే దుష్టసంస్కారాలపై పోరుకు పట్టుదల పెంచుతుంది.
బలమైన వస్తువును లాగేందుకు, బలమైన మోకును తయారుచేస్తారు. అలాగే మనసు, బుద్ధి, శరీరం ఒకేలక్ష్యంతో పనిచేయాలి. మనసు చెప్పినమాట బుద్ధి విని, శరీరం ఆచరించాలి. కొన్నిసార్లు మనోవాంఛలను తీర్చడంలో బుద్ధి అశక్తత వ్యక్తం చేస్తుంది. నైపుణ్యం, సూక్ష్మ గ్రహణశక్తి, ఏకాగ్రత, వివేక విచక్షణ విశ్లేషణలు, తార్కిక తాత్విక ఆలోచనలు, ప్రణాళిక, దూరదృష్టి... ఇవన్నీ బుద్ధి సంపదలు. ప్రచోదయమైన బుద్ధిలోనే ఇవి నూరుశాతం ఉంటాయి. మరికొన్నిసార్లు మనోభీష్టాలను నిశ్చయాత్మక బుద్ధి ఇవ్వగలిగినా, శరీరం సహకరించక అవి నెరవేరవు. తనలోని ఈ శక్తులను పురిగొల్పి ఐక్యపరచడమే కార్యసాధకుడి ప్రథమ కర్తవ్యం.
పాండవుల్లో ఐక్యత, ధర్మరాజుపై అపారగౌరవం, శిరోధార్యమైన శ్రీకృష్ణుడి సూచనలు, ద్రౌపది ప్రోత్సాహం... పాండుపుత్రులను విజయంవైపు నిలబెట్టాయి. కురుపక్షంలో ఈ సఖ్యత పూర్తిగా కొరవడింది. వృత్తి ధర్మానికి తలొగ్గి, అధర్మపక్షాన ఉండాల్సిన దుస్థితి భీష్మ ద్రోణ కృపులను కుంగదీసింది. నాయకుడైన దుర్యోధనుడు భీష్మాదుల నిబద్ధతను శంకించి కించపరచడం, కర్ణభీష్మాదుల మధ్య అభిప్రాయ భేదాల వంటివి ఈ మహావీరుల పోరులో గెలవాలన్న కసిని లేకుండా చేశాయి.
ధ్యాన, యోగ, అభ్యాస, అనుష్ఠాన క్రియలన్నీ మనిషిలోని శక్తులను ఐక్యపరచి కార్యోన్ముఖులను చేయడానికే. కార్యసాధనలో విపత్కర పరిస్థితులు ఎదురైతే, ఆత్మశక్తి కొండంత అండగా నిలుస్తుంది. శ్రీకృష్ణుడు అనే ఆత్మశక్తి కొలువైన అంతరంగం నుంచి గీతోపదేశంలా ఆత్మసందేశం వినిపిస్తుంది. తక్షణ కర్తవ్యం బోధపడుతుంది.