విజయవాడ సెప్టెంబర్ 4,
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తోంది. రైతును కాపాడాల్సిన ప్రభుత్వమే, వారిని వేధిస్తోంది. గత ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేయడానికి సిద్ధంగా ఉంచిన 4 , 5 విడతల రుణమాఫీ సొమ్ము కూడా రైతులకు ఇవ్వలేదు. రైతు భరోసా కేంద్రాలకు రంగులు వేసి పార్టీ కేంద్రాలుగా మార్చారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఖరీఫ్ ప్రారంభమైనా ఇంతవరకు రైతులకు సకాలంలో రుణాలు అందలేదు. రైతులకు ఈ ప్రభుత్వం ఎంతఖర్చుచేసిందనే దానిపై శ్వేతపత్రం విడుదలచేయాలి. కౌలు రైతులను ఎలా గుర్తించారో, వారినెలా ఆదుకున్నారో పాలకులు సమాధానం చెప్పాలి. 14 సొసైటీల్లో 3వేల మెట్రిక్ టన్నుల పంటఉత్పత్తులు సమీకరించామని చెప్పారు. కొనుగోళ్ల ముసుగులో సదరు సొసైటీల్లో జరిగిన అక్రమాల చిట్టా బయటపెట్టండి. ఎమ్మెల్యేలే పంటఉత్పత్తుల కొనుగోలులో దళారులుగా మారి, రైతులనోట్లో మట్టి కొట్టారు. వడ్డీలేని రుణాలు ఎంతమంది రైతులకు ఇచ్చారో చెప్పాలని అయనఅన్నారు.
రైతులకు యాంత్రీకరణ పరికరాలు అందడం లేదు. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయానికి మంగళం పాడారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాజశేఖర్ రెడ్డి, రైతుల పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకించారు. మరిప్పుడు అదే నిర్ణయాన్ని జగన్ ఎందుకు అమలుచేస్తున్నారు ? చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలవల్ల రా ష్ట్రంలో మిగులు విద్యుత్ ఏర్పడింది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో విద్యుత్ వాడకాన్ని ప్రభుత్వం తెలుసుకోలేదా? ఎవరికి తొత్తులుగా మారి, రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ ను నిలిపేస్తున్నారు. వ్యవసాయపంపు సెట్లకు మీటర్లు బిగించే నెపంతో ఎంత దోచుకోవాలనుకుంటున్నారు? అప్పుతెచ్చిన లక్షకోట్లను ఎవరికి పంచారో చెప్పాలి. పింఛన్ దారులకు రూ.2,250 ఇస్తూ, రైతుకు మాత్రం నెలకు రూ.500 ఇస్తే సరిపోతుందా? మాయమాటలు, కల్లబొల్లి కబుర్లతో పాలన చేస్తూ, రైతులను మోసగించడం ఎల్లకాలం సాగదని అయనఅన్నారు.