YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరోనా లెక్కలపై మళ్లీ తలంటిన హైకోర్టు

కరోనా లెక్కలపై మళ్లీ తలంటిన హైకోర్టు

హైద్రాబాద్, సెప్టెంబర్ 4 
కరోనా లెక్కల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వైరస్ సోకిన రోగులు, మరణాల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని అభిప్రాయపడింది. కరోనా కేసులు, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండడం పట్ల హైకోర్టు ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. మార్చి 31 నుంచి ఇప్పటి వరకు కేవలం రోజుకు 8 లేదా 9 లేదా 10 మంది మాత్రమే కరోనా వల్ల చనిపోతున్నారని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. దీనిపై స్పందించిన హైకోర్టు నివేదిక నిర్లక్ష్యంగా, అస్పష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. రోజుకు ఏక సంఖ్యలోనే మరణాలు సంభవిస్తున్నాయా అని ప్రశ్నించింది. కరోనా మృతులపై వాస్తవ వివరాలు వెల్లడించాలని ఆదేశించింది.రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వ నిర్లిప్తత, ప్రైవేటు దోపిడీ కట్టడి విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరి వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రజారోగ్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో చెప్పాలని పిటిషనర్ కోరగా, దీనిపై కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాకి ముందు ఎంత నిధులు కేటాయించారు, కరోనా తర్వాత ఎంత కేటాయించారనే అంశాలను తెలియజేయాలని కోరింది. ఈనెల 22లోపు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తప్పుడు నివేదికలు కనుక సమర్పిస్తే చీఫ్ సెక్రటరీని కోర్టుకు పిలవాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయంటూ దాఖలైన పిటిషన్లపైనా హైకోర్టు విచారణ చేపట్టింది. అలాంటి ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆస్పత్రులు చట్టానికి అతీతమా? అని ప్రశ్నించింది. రాయితీలు తీసుకున్న ప్రైవేటు ఆస్పత్రులకు ప్రజలకు సేవచేసే బాధ్యత లేదా? అని వ్యాఖ్యానించింది. దోపిడీలకు పాల్పడుతున్న ప్రైవేటు ఆస్పత్రులపై విచారణ జరిపి ఈనెల 22లోపు నివేదిక అందజేయాలని జాతీయ ఫార్మా సంస్థను.. నివేదిక రాగానే బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని పీహెచ్‌ డైరెక్టర్‌ను న్యాయస్థానం ఆదేశించింది.అంతేకాక, ప్రైవేటు ఆస్పత్రుల్లో సగం పడకలు ప్రభుత్వం తరపున రిజర్వు చేస్తామన్న మంత్రి హామీ ఎందుకు అమలుకావడం లేదని ప్రశ్నించింది. ఈ విషయంపై స్పష్టత కావాలని ఒకవేళ రిజర్వు చేయొద్దని నిర్ణయిస్తే కారణాలు వెల్లడించాలని ఆదేశించింది.

Related Posts