విశాఖపట్టణం, సెప్టెంబర్ 4
విశాఖలో మరో కొత్త గ్యాంగ్ రంగంలోకి దిగింది. బ్యాంకుల దగ్గర కాపు కాచి డబ్బులు చోరీ చేస్తోంది ఓ లేడీ గ్యాంగ్. ఓ మహిళకు బురిడీ కొట్టించి డబ్బు దోచుకెళ్లారు. జానకయ్యపేటకు చెందిన సత్యవతి నక్కపల్లి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో బంగారంపై తీసుకున్న రుణం చెల్లించడానికి బ్యాంక్ బయట వేచి ఉంది. అదే సమయంలో చంటిపిల్లలతో ఇద్దరు మహిళలు వచ్చారు.. ఆమెను మెల్లిగా మాటల్లో దింపారు. ఇంతలో వారిద్దరిలో ఓ మహిళ సత్యవతి సంచిలో ఉన్న డబ్బు తీసేసింది. డబ్బు దొరకగానే ఓ ఆటో ఎక్కి అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు.బ్యాంకు దగ్గర కొద్దిసేపటికే డబ్బు మాయం కావడం చూసి సత్యవతి షాకయ్యింది.. డబ్బు పోయిందని చెప్పింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత ఆ పక్కనే ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. చోరీ జరిగిన తీరు రికార్డయ్యింది. దొంగతనానికి వచ్చిన మహిళలు కూడా మాస్క్‌లు ధరించి ఉండటంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. డబ్బుతో బయటకు వచ్చేవారు గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.