ఏలూరు, సెప్టెంబర్ 5
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి రాజకీయ వ్యూహాల్లో కేవీపీ రామచంద్రరావుది ఎంత ప్రత్యేకమైన పాత్రో చెప్పక్కర్లేదు. వైఎస్ రాజకీయ వ్యూహాల్లో అయినా, పార్టీ, ప్రభుత్వ వ్యూహాల్లో అయినా కేవీపీ చక్రం తిప్పారంటే పనయిపోవాల్సిందే. కేవీపీ వ్యూహానికి నాటి సమైక్య రాష్ట్రంలో అంత క్రేజ్ ఉండేది. ఇప్పుడు కేవీపీ బావమరిది మేడవరపు అశోక్‌బాబు కూడా పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంత వైఎస్సార్‌సీపీ రాజకీయల్లో తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు దివంగత మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు అనుంగు అనుచరుడిగా ఉన్న అశోక్‌బాబు ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌లోకి వెళ్లారు. 2009 ఎన్నికల్లో చింతలపూడి ఎమ్మెల్యేగా మద్దాల రాజేష్ గెలుపులో తనవంతు పాత్ర పోషించిన ఆయన చింతలపూడి ఏఎంసీ చైర్మన్ పదవి చేపట్టారు.మేడవరపు అశోక్‌బాబు ఉన్న పొలిటికల్ స్టామినాకు ఆయన జిల్లా స్థాయిలో చక్రం తిప్పే అవకాశం ఉంది. నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు నేడు వైసీపీ మంత్రులు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలతో ఆయనది సరిసమానమైన స్థాయి. రాజకీయంగా వ్యూహాలు పన్నడంలో మేడవరపు అశోక్‌బాబుకు ఆయనే సాటి అన్నట్టుగా ఆయన రాజకీయం ఉంటుంది. శత్రువులను కూడా చాకచక్యంగా తన వైపునకు తిప్పుకోవడంలో ఆయన నేర్పరి. 2014 ఎన్నికలకు ముందే నాడు చింతలపూడి నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపు రాజకీయాలతో పాటు వైఎస్ కుటుంబంపై ఉన్న అభిమానంతో ఆయన వైసీపీలోకి జంప్ చేసేశారు. ఇక కోటగిరి శ్రీథర్, మేడవరపు అశోక్‌బాబు రాజకీయం ఇప్పుడు మెట్ట ప్రాంతంలో వైసీపీని ఓ బలమైన శక్తిగా మార్చేసింది. శ్రీథర్ ఎంపీగా ఉన్నా ఆయన సొంత నియోజకవర్గం చింతలపూడిలో మేడవరపు అశోక్‌బాబు హవానే ఎక్కువ ఉంటుంది.మేడవరపు అశోక్‌బాబుకు చింతలపూడి నియోజకవర్గ రాజకీయాల్లోనే కాకుండా మెట్ట ప్రాంతంలో పోలవరం, దెందులూరు, ఉంగుటూరు, గోపాలపురం నియోజకవర్గాల్లోనూ అనుచరగణం ఉంది. మేడవరపు అశోక్‌బాబు రాజకీయమంటేనే ఓ స్పెషాలిటీ ఉంటుంది. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండంతో చింతలపూడి నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనూ ఆయన ఆధిపత్యమే కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణతో మేడవరపు అశోక్‌బాబుకు తీవ్రమైన రాజకీయ శతృత్వం ఉంది. ఆ మాటకు వస్తే దివంగత మంత్రి కోటగిరి విద్యాధరరావు, ప్రస్తుత ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీథర్‌తో సైతం మురళీకి ఏ మాత్రం పొసగదు. వాస్తవానికి వైసీపీలో ఉన్నప్పుడే మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ వెనక ఉన్న ఒక్కొక్కరిని తనవైపునకు తిప్పుకున్న అశోక్ ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా మురళీ అనుచరులను ఒక్కొక్కరిని తన వైపునకు తిప్పేసుకుంటున్నారు.ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గంలో మురళీకి చెప్పుకోదగ్గ అనుచరులు కూడా లేని పరిస్థితి. చివరకు మురళీ టీడీపీలోకి వెళ్లినా మొన్న ఎన్నికల్లో సాధారణ కార్యకర్తలతోనే వైసీపీకి మెజార్టీ తెప్పించేలా మేడవరపు అశోక్‌బాబు చక్రం తిప్పారు. ఇక ఎన్నికల తర్వాత మురళీ వర్గంతో పాటు టీడీపీలోని కీలక నేతలు అందరిని వరుసపెట్టి వైసీపీలో చేర్చేసుకుంటున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో గత ఎన్నికల్లోనే వైఎస్సార్‌సీపీకి 36 వేల మెజార్టీ రాగా.. ఇప్పుడు స్థానిక సంస్థల్లో అసలు టీడీపీ తరపున అభ్యర్థులు పోటీలో లేని పరిస్థితి. కొన్ని జడ్పీటీసీలు పార్టీకి ఏకగ్రీవం అయితే.. మరికొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీలో లేరు. ఇక నియోజకవర్గంలో కీలకమైన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ చైర్‌పర్సన్ క్యాండెట్ కూడా అశోక్ వర్గం మనిషే ఉన్నారు.చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్న వీఆర్. ఎలీజాతో మేడవరపు అశోక్‌బాబుకు పొసగడం లేదన్న చర్చలు కూడా సొంత పార్టీ నేతల్లోనే ఉన్నాయి. ఎంపీ శ్రీథర్, మేడవరపు అశోక్‌బాబుకు ఉన్న బలమైన వర్గం, దూకుడు ముందు ఎలీజా పొలిటికల్ రేసులో వెనకపడిపోతున్నారనే అంటున్నారు. మేడవరపు అశోక్‌బాబుకు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ బలమైన అనుచరగణం ఉంది. గత ఎన్నికలకు ముందే వచ్చిన ఎలీజా ఎమ్మెల్యేగా గెలిచినా కొంతమందికే ప్రయార్టీ ఇవ్వడం కూడా ఆయనకు మైనస్‌గా మారిందంటున్నారు. ఇక శ్రీథర్, అశోక్‌కు బలమైన వర్గాల మద్దతు ఉంది. ఈ క్రమంలోనే ఎలీజాకు వీరి వర్గంతో పడడం లేదన్న ప్రచారం ఉంది. ఏదేమైనా ప్రస్తుతం వైసీపీలో కేవీపీ బామ్మర్ది అశోక్ హవా మామూలుగా లేదనే చెప్పాలి.