విజయవాడ, సెప్టెంబర్ 5
ముఖ్యమంత్రి జగన్ పక్కా బిజినెస్ మెన్. ప్రతి అడుగులో లాభం చూసుకుంటారు. ప్రతి నిర్ణయాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే జగన్ ఏదైనా నగదు రూపంలో ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. చివరకు రైతులకు ఉచిత సబ్సిడీ పథకాన్ని కూడా నగదు రూపంలో మార్చడం ఏపీలో చర్చనీయాంశమైంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి చేపట్టి పదిహేను నెలలు కావస్తుంది. ఈ సమయంలో దాదాపు 3.5 కోట్ల మందికి వివిధ పథకాల ద్వారా నేరుగా నగదును లబ్దిదారుల ఖాతాల్లోకే చేర్చారు. వీటి విలువ దాదాపు 65 వేల కోట్లు ఉంటుందని అంచనా.ప్పుడు తాజాగా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్తును కూడా ఇకపై నగదు రూపంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్తు ప్రవేశపెట్టారు. నిర్ణీత సమయంలో ఇచ్చే విద్యుత్తును రైతులు ఉచితంగా వినియోగించుకోవచ్చు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు ఖర్చు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తూ వస్తుంది. ఇప్పటి వరకూ అదే విధానం కొనసాగింది. ఏపీలో 18 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లున్నాయి. 12 వేల మిలియన్ల యూనిట్లు వినియోగిస్తున్నారు.కొత్తగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రతి పంపు సెట్ వద్ద విద్యుత్తు మీటరును బిగిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తును అందజేస్తుంది. ఈ సమయంలో రైతు ఎంత విద్యుత్తును అయినా వినియోగించుకోవచ్చు. ఇందులో షరతులు ఏమీ లేవు. అయితే దీనివల్ల రైతుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. రైతు ఎంత విద్యుత్తును వినియోగించుకున్నా ఆ సొమ్మును రైతు ఖాతాలోనే ప్రభుత్వం జమ చేయనుంది. ఏటా ప్రభుత్వం 8,400 కోట్లు సబ్సిడీ రూపంలో ఖర్చు పెడుతుంది. ఈ మొత్తం అంతా రైతుల ఖాతాల్లోనే జమ కానుంది. రైతుకు అదనంగా దీనివల్ల పడే భారముండదు. కేవలం విద్యుత్తు వినియోగంలో జవాబుదారీతనం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.జగన్ ప్రభుత్వం ప్రతి పథకాన్ని ప్రజలకు క్యాష్ రూపంలోనే అందజేస్తుంది. ఇందువల్ల రాజకీయ ప్రయోజనం కూడా లేకపోలేదంటున్నారు. రాజకీయ ప్రయోజనంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సబ్సిడీల రూపంలో ఇస్తే అది లబ్దిదారుడికి తప్ప ఎవరికీ లాభం ఉండదు. నగదు రూపంలో చెల్లిస్తే లబ్దిదారుడు ఆ నగదును వివిధి అవసరాల కోసం వాడతాడు. తద్వారా క్యాష్ రొటేషన్ అవుతుంది. వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా లభిస్తుంది. దీంతో పాటు లబ్దిదారుడికి ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుంది. ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కారణంగానే జగన్ అన్నీ క్యాష్ రూపంలోనే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు కన్పిస్తుంది. మొత్తం మీద కరెన్సీ నోటుతోనే ఓటును కొల్లగొట్టాలన్న జగన్ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.