YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పంచాయతీ వేడి

 పంచాయతీ వేడి

పల్లెల్లో అప్పుడే రాజకీయ సందడి మొదలైంది. 2019లో జరిగే సాధారణ ఎన్నిలకు ముందుకు వచ్చే పంచాయతీ ఎన్నికలను సెమి ఫైనల్‌గా భావిస్తున్న ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలను రెండు నెలల్లోనే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల పోరును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రెండునుంచి మూడు విడతల్లో పోలింగు నిర్వహించ తలపెట్టింది. నల్లగొండ జిల్లాలో గతంలో 502 గ్రామపంచాయతీలుండగా మార్పులు, చేర్పులు అనంతరం ఈ సంఖ్య 844కు చేరింది. పంచాయతీ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన అనంతరం కొత్తపంచాయతీల ఏర్పాటు, తండాలు గ్రామపంచాయతీలుగా ఏర్పాటుకు ఆమోదం లభించినట్లయ్యింది.

రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధికంగా పంచాయతీలు ఏర్పడ్డాయి. గ్రామపంచాయతీలకు గడువులోగానే ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో నల్లగొండ జిల్లా అధికారులంతా ఆవైపు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలను పార్టీల గుర్తులమీద కాకుండా స్వతంత్ర గుర్తులతోనే నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు ఆగస్టు 1తో ముగియనుంది. సరిగ్గా నాలుగు నెలల్లోనే పంచాయతీల గడువు ముగుస్తోంది. ఈలోగానే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించిన రోజే అదేరోజు సాయంత్రానికి కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు. ఈసారి నిర్వహించే ఎన్నికలకు పదేళ్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. రిజర్వేషన్లను పూర్తి చేయడం, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు, వార్డుల విభజన చేయాల్సి ఉంటుంది.

జనాభా ఆధారంగా పంచాయతీలో వార్డుల సంఖ్యను చేయనున్నారు. వార్డుల విభజన అనంతరం ఆ జాబితాలో బీసీ ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా షెడ్యూల్‌ను జారీచేస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు బ్యాలెట్‌ బాక్సులు, ఎన్నికల సిబ్బంది, భద్రతా సిబ్బంది ఏ మేరకు అవసరమున్నది అనే దానిపై దృష్టి సారిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారికి దశలవారీగా శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో ఇప్పటి వరకూ కొంత గందరగోళం ఉంది. పాత రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలు నిర్వహిస్తారా? కొత్తగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపడతారా? అనే సందేహాలను తొలగిస్తూ ప్రభుత్వం మళ్లీ రిజర్వేషన్లు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో జరిగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన మళ్లీ రిజర్వేషన్లను కొత్తగా చేయనున్నారు. ప్రస్తుతం చేసే రిజర్వేషన్లు పదేళ్ల వరకు అంటే ఈ రెండు టర్మ్‌లకు సంబంధించిన ఎన్నికలకు ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. రిజర్వేషన్ల ఆధారంగానే ఆశావహుల రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది. రిజర్వేషన్ల ప్రక్రియ మొదలవగానే పార్టీల వారీగా నాయకులు, కార్యకర్తలు పోటీకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి రిజర్వేషన్లు తారుమారు కానుండటంతో నేతల తలరాతలు కూడా మారనున్నాయి.

గ్రామపంచాయతీల ప్రస్తుత పాలక మండళ్లకు గడువు మరో నాలుగు నెలల్లో ముగియనుంది. ఆగస్టు1తో పదవీకాలం ముగిసేలోగానే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే జూన్‌1నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండటంతో అంతకంటే ముందే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే అవసరమైన పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, పోలింగ్‌ సిబ్బంది వివరాలు, కర్ణాటకనుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు పోలింగ్‌ బాక్స్‌ల తరలింపువంటి ప్రక్రియలను పూర్తిచేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుతం 334 గ్రామ పంచాయతీలుండగా.. కొత్తగా 84 గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఖరారు చేసింది.

17 పంచాయతీలు వివిధ మునిసిపాలిటీలు, నగరపంచాయతీల్లో విలీనంకానుండటంతో మొత్తం జిల్లాలో 401పంచాయతీలకు ఎన్నికలు జరపడానికి అవసరమైన చర్యలను జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. జనాభా ప్రాతిపదికన వార్డులసంఖ్యను కూడా ప్రభుత్వం నిర్ధారించడంతో జిల్లాలో 401పంచాయతీ సర్పంచ్‌ పదవులకు, 3,885 వార్డుసభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం అవసరమైన పోలింగ్‌ సామాగ్రితోపాటు సిబ్బంది వివరాలు సేకరించి ఎన్నికల సంఘానికి నివే దించడంతో మరో రెండు మాసాల్లో ఎప్పుడైనా ఎన్నికలు జరుగవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతుండటంతో పల్లెల్లో అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ అభ్యర్థులను బరిలోకి దింపి మెజారిటీ పంచాయతీలను తమ ఖాతాల్లో వేసుకునేందుకు కసరత్తు చేసే అవకాశాలు ఉంటాయి. ఇక గ్రామాల్లో కాంగ్రె స్‌, తెలుగుదేశం, బీజేపీ, సీపీఎం, సీపీఐలు కూడా ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకొని పోటీ చేయనున్నాయి. గ్రామాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతిపక్షపార్టీలు పొ త్తు పెట్టుకునే అవకాశాలుంటాయి. అధికారపార్టీని ఎదుర్కొనేందుకు ఆయా గ్రామాల్లో పొత్తులు ఉంటాయని తెలుస్తోంది. అయితే అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల నియోజకవర్గ ఇన్‌చార్జిలను ఈ ఎన్నికలను సవాలుగా తీసుకొని ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఇక సమస్యాత్మకంగా ఉన్న గ్రామాలపై పోలీసులు కూడా దృష్టి సారించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేలా పోలీస్‌ యంత్రాంగం కార్యాచరణ రూపొందించనుంది.

Related Posts