YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కృష్ణం వందే జ‌గ‌ద్గురుం!*

కృష్ణం వందే జ‌గ‌ద్గురుం!*

ఒక మ‌నిషి త‌న జీవితంలోని ప్రతీ ద‌శ‌లోనూ విజ‌యాన్ని సాధించ‌డం అంత తేలికైన ప‌ని కాదు. కానీ నిర్వహించిన ప్రతి బాధ్యత‌లోనూ త‌నదైన ముద్ర వేసుకున్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని లీల‌లు ఒక ఎత్తైతే, వాటికి ఏమాత్రం తీసిపోని ఆయ‌న ప‌రిణ‌తి మ‌రో ఎత్తు. అందుకే ప‌రంలో మోక్షాన్ని అందించే భ‌గ‌వంతునిగానే కాదు. ఇహంలో విజ‌యాల‌ను సాధించేందుకు మార్గం చూపే గురువుగా కూడా భావిస్తారు.
*క‌ష్టాల‌తో జీవితం మొద‌లు:*
  కృష్ణుడు అంతఃపురంలోని ప‌ట్టుప‌రుపుల మీద జ‌న్మించ‌లేదు. చెర‌సాల‌లోని రాతి నేల మీద ప‌డ్డాడు. వార‌స‌త్వంగా రాజ్యాన్ని కాదు. మేన‌మామ కంసుని ప‌గ అనే ప‌డ‌గ నీడ‌ను పొందాడు. పుట్టగానే త‌ల్లిదండ్రుల నుంచి వేర‌యి గోకులం అనే ప‌ల్లెను చేరుకున్నాడు. కృష్ణుని తండ్రైన వ‌సుదేవుడంత‌టి వాడు, అర్థరాత్రి క‌న్నయ్యను రాజ్యం దాటించేందుకు గాడిద కాళ్లను సైతం ప‌ట్టుకోవ‌ల‌సి వ‌చ్చింది. అలా రారాజుగా ఉండవ‌ల‌సిన పిల్లవాడు ప‌శువుల‌కాప‌రిగా మారాడు. అయితేనేం ఆ చిన్ని ప‌ల్లెనే పిల్లల రాజ్యంగా మార్చివేశాడు. పేద‌రిక‌లోనో, క‌ష్టాల‌తోనో పుట్టామ‌ని బాధ‌ప‌డేవారికి కృష్ణుని బాల్యం ఒక ఊర‌ట‌.
*అల్లరి క‌న్నయ్య:* పిల్లలు అదేప‌నిగా అల్లరి చేస్తే మా చెడ్డ కోపం వ‌స్తుంది పెద్దల‌కి. అలాగ‌ని స్తబ్దుగా కూర్చున్నారా! అనారోగ్యం ఏమ‌న్నా చేసిందా అని దిగాలు ప‌డిపోతారు. ఎందుకంటే పిల్లల కేరింత‌లే కుటుంబానికి శుభ‌సంకేతాల‌ని వాళ్లకి తెలుసు! కృష్ణుని అల్లరీ అలాంటిదే. గోకుంలోని తోటి పిల్లలంద‌రినీ క‌లుపుకుని క‌న్నయ్య చెల‌రేగిపోయేవాడు. అలాగ‌ని త‌న అల్లరితో ఎవ‌రికీ హాని త‌ల‌పెట్టలేదు. ఇత‌రుల ఆస్తికి న‌ష్టం క‌లిగించ‌లేదు. ప‌గిలిన వెన్నకుండ‌లు, ఇరుగుపొరుగుల చీవాట్లు... ఇవే క‌న్నయ్య అల్లరికి ప‌రాకాష్ట. క‌న్నయ్యలాంటి ఒక పిల్లవాడు త‌న క‌డుపున పుడితే బాగుండు అని ప్రతి హిందూ స్త్రీ త‌పించిపోయేంత ప‌రిపూర్ణంగా కృష్ణుని బాల్యం గ‌డిచింది.
*గోవుల కాప‌రి:*
కృష్ణుని రూపం పూజ‌లందుకునే ప్రతిచోటా ఆయ‌న వెనుకే గోవు కూడా ఉంటుంది. భార‌తీయులు అనాదిగా గోవుని త్యాగానికీ, స్వచ్ఛత‌కూ ప్రతిరూపంగా భావిస్తారు. గోవుల‌ను సంతోష‌పెట్టేందుకే కృష్ణుడు వేణువుని ఆల‌పించేవాడంటారు. ఒక సంద‌ర్భంలో కృష్ణుడు గోవ‌ర్ధన‌గిరిని ఎత్తి ప్రజ‌ల‌ను, గోకులాన్ని వ‌ర్షం నుంచి కాపాడాడ‌ని ప్రతీతి. మ‌నుషులకీ, మ‌ట్టికీ నీరు త‌గిలితే ఏమీ కాదు. కానీ గోవులు మాత్రం నీటి చుక్క త‌గిలితే ఎందుకో చిరాకుప‌డిపోతాయి. చాలామంది వ్యాపారులు గోవుల‌ను అవ‌త‌లికి పంప‌డానికి వాటి మీద నీళ్లను చ‌ల్లుతూ ఉంటారు. అలాంటి గోవుల‌కు ఇబ్బంది క‌లుగ‌కుండా ఉండేందుకే శ్రీకృష్ణుడు గోవ‌ర్ధన‌గిరిని ఎత్తాడ‌ని అంటారు కొంద‌రు.
*సోద‌రునిగా:*
త‌న చెల్లెలైన సుభ‌ద్ర మ‌న‌సులో అర్జునుడు ఉన్నాడ‌ని తెలుసుకుని, వారిద్దరికీ వివాహం జ‌రిగేలా చూస్తాడు శ్రీకృష్ణుడు. దానివ‌ల్ల పాండ‌వుల భార్య అయిన ద్రౌప‌ది త‌న చెల్లెలుకి స‌వ‌తి అవుతుంది. అయినా ద్రౌప‌దిని కూడా త‌న సొంత చెల్లెలుగా భావించాడు కృష్ణుడు. వారిద్దరి మ‌ధ్యా ఉన్న అనురాగ‌మే ర‌క్షాబంధ‌నానికి నాందిగా చెబుతారు. కౌర‌వుల నిండుస‌భ‌లో ద్రౌప‌దిని వివ‌స్త్రను చేస్తుంటే, పాండవులు సైతం
నేల‌చూపులు చూస్తారు. అలాంటి సంద‌ర్భంలో తానే ఆమె గౌర‌వాన్ని నిలుపుతాడు. అలాగ‌ని సుభ‌ద్రకూ ఏమీ త‌క్కువ చేయ‌లేదు. నా వార‌సుడే ఈ రాజ్యాన్ని ఏలాలి అన్న సుభ‌ద్ర కోరిక‌ను మ‌న్నిస్తూ, ఆమె మ‌న‌వ‌డైన భ‌ర‌తునికి ప‌ట్టాభిషేకం జ‌రిపిస్తాడు.
*యుద్ధస‌మ‌యాన‌‌:*
ఇక కృష్ణుడు లేని కురుక్షేత్రాన్ని ఎలా ఊహించ‌గ‌లం. కౌర‌వ‌పాండ‌వుల మ‌ధ్య యుద్ధం అనివార్యం అని తెలిసి కూడా త‌న వంతుగా సంధికి ప్రయ‌త్నిస్తాడు. రాయ‌బారిగా యుద్ధాన్ని నిలువ‌రించ‌లేన‌ప్పుడు ర‌థ‌సార‌థిగా అర్జునుడికి మార్గనిర్దేశం చేస్తాడు. అంత‌టి ప‌రాక్రమ‌వంతుడైన గాండీవి కూడా యుద్ధరంగాన వెనుక‌డుగు వేసిన‌ప్పుడు... సుదీర్ఘమైన గీతాబోధ‌తో మాన‌వుల‌కు ప్రతినిధి అయిన అర్జునునికి కర్మసిద్ధాంతాన్నీ, జీవిత‌సారాన్నీ బోధించాడు శ్రీకృష్ణుడు.
*మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా ! నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః !! (3.30)*
స‌మ‌స్త క‌ర్మల భారాన్నీ నాయందు ఉంచి ఎటువంటి ఆశ‌ కానీ, మ‌మ‌కార‌ము కానీ, నిస్తేజ‌ము కానీ లేకుండా నిర్భయంగా యుద్ధం చేయి అని గీత‌లో ఒక‌చోట ఉంటుంది. భ‌క్తినీ, భ‌గ‌వంతునీ; క‌ర్మనీ, క‌ర్తృత్వాన్నీ; వ‌్యక్తినీ, వ్యక్తిత్వాన్నీ ఇంతగా విడ‌మ‌ర‌చి చెప్పే శ్లోకాలు గీత‌లో కొల్లలు. అందుకే శ్రీకృష్ణుడు ప‌రిపూర్ణమైన భ‌గ‌వంతుడే కాదు, విజ‌య‌వంత‌మైన జీవితానికి ఉదాహ‌ర‌ణ కూడా!

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts