నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీల్లో ప్రవేశాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈనెల 6న ఆదివారం నిర్వహిస్తున్న పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. గుంటూరు నుంచి విశాఖపట్నానికి 5వ తేదీ సాయంత్రం 6గంటలకు బయలుదేరుతుంది. గుంటూరు నుంచి మంగళగిరి, కృష్ణా కెనాల్ జంక్షన్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి నుంచి విశాఖపట్నం చేరుకుంటుంది. ఇదే రైలు 6వ తేదీ విశాఖపట్నం నుంచి రాత్రి 8గంటలకు గుంటూరుకు బయలుదేరుతుంది.
మరో రైలు విజయవాడ నుంచి చిత్తూరుకు 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతుంది.
విజయవాడ, కృష్ణాకెనాల్, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, టంగుటూరు, కావలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, పాకాల మీదుగా చిత్తూరుకు చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు 6వ తేదీ రాత్రి 8గంటలకు చిత్తూరు నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుంటుంది.
అదే విధంగా ఉత్తరాంత్ర జిల్లాల నుంచి విశాఖపట్నంలో పరీక్ష రాసేందుకు వచ్చే వారి కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైలును నడుపుతుంది. శనివారం సాయంత్రం 5 గంటలకు ఇచ్ఛాపురంలో రైలు (05831) బయలుదేరి రాత్రి 9 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరిగి ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు విశాఖలో రైలు (05832) బయలుదేరి రాత్రి 22.30 గంటలకు ఇచ్చాపురం చేరుతుంది. మొత్తం 18 కోచ్‌లతో నడిచే ఈ రైలు సోంపేట, పలాస, నౌపాడ, కోటబొమ్మాళి, శ్రీకాకుళం రోడ్డు, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
ఈ రైలులో ప్రయాణించే అభ్యర్థులు విధిగా అడ్మిట్ కార్డ్ తోపాటు మాస్కు ధరించడం, శానిటైజర్ ఉండాలి. ఈ ప్రత్యేక రైళ్లకు స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్లు ఇస్తారు.
*Dr. Arja Srikanth*