బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఆ పదవికి రాజీనామా చేశారు. ఏపీ రాష్ట్ర విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు కంభంపాటి లేఖను పంపించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రాజీనామా విషయంలో భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అలాగే కంభంపాటి ఎందుకు రాజీనామా చేశారనే అంశంపై కూడా ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. తన బాధ్యతలను ఇన్నేళ్లూ సక్రమంగా నిర్వర్తించానని పేర్కొంటూ హరిబాబు రాజీనామా లేఖను పంపించినట్టు సమాచారం. భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్ష పదవిలోకి కొత్త నేత రాబోతున్నాడని చాన్నాళ్లుగానే ప్రచారం జరుగుతోంది. అదెవరనే అంశంపై అనేక ఊహాగానాలున్నాయి. కొన్నాళ్ల కిందటే హరిబాబు పదవీకాలం ముగిసినా, ఆయననే కొనసాగిస్తూ వస్తోంది బీజేపీ అధిష్టానం. ఇప్పుడు ఆయన రాజీనామా నేపథ్యంలో మరో కమలనాథుడికి ఆ బాధ్యతలు దక్కే అవకాశాలున్నాయి. హరిబాబు పార్టీ అధ్యక్షుడి హోదాలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తుతూ ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. మోడీపై బాబు చేస్తున్న ఆరోపణలు అసంబద్ధం అని, మోడీ మళ్లీ ప్రధాని కావాలి అంటూ ఇటీవలే చంద్రబాబు నాయుడు ఎన్డీయే పక్షాల సమావేశంలో తీర్మానం చేసిన విషయాన్ని హరిబాబు గుర్తు చేశారు. ఇంతలోనే హరిబాబు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టుగా వార్తలు వస్తుండటం గమనార్హం.