ధ్యానాత్మక జీవితం*
మట్టిబెడ్డల కింద విత్తనం తపస్సు చేస్తుంది. వాన దేవుడి కరుణ వల్ల అది మొలకై మొలుస్తుంది. ఎదుగుతున్న దశలో మొక్కకు అప్పుడప్పుడు చారెడు నీళ్లు పోసిన మనిషికి అది జన్మంతా రుణపడి ఉంటుంది. బదులుగా దాని బతుకు పొడుగూతా చాకిరీ చేస్తుంది. పూజకు పూలిస్తుంది. వ్యాధుల నివారణకు ఔషధమై నిలుస్తుంది. ప్రాణవాయువు అందిస్తూ జీవితాలు నిలబెడుతుంది. ఎండాకాలంలో నీడ ఇస్తుంది. వానల కాలంలో వర్షాలు కురిపిస్తుంది. చెట్టు నిండా పండ్లతో ఆకలి తీర్చుతుంది. కొమ్మలు ఆరబెట్టి కిటికీలు, దర్వాజాలతో ఇల్లై నిలబడుతుంది. పొయ్యిలోకి కట్టెలనిస్తుంది. అంతిమంగా బూడిదై గిన్నెల అంట్లు తోముతుంది. మానవాళికి ఇంతగా సేవలందించే చెట్టు మాత్రం లాభ నష్టాల బేరీజు వేసుకోదు. కారణం, దానికి ఆలోచించే శక్తి లేదు. అదీ దాని మంచికే. ఎందుకంటే, ఎలాంటి యోచన లేని చోట ధ్యానం బాగా కుదురుతుంది. అందువల్లే ‘చెట్లు ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటాయి’ అనేవారు ప్రఖ్యాత తత్వవేత్త ఓషో. మనిషైనా, మానైనా ధ్యానం వల్లే ఉన్నత స్థాయికి ఎదిగేది. ఇంటి ముందు తులసి, తోటలో పూల మొక్కలు, పెరటిలో మరెన్నో చెట్లు... ఇలా మనిషికి, చెట్టుతో విడదీయలేని బంధం ఉంటుంది.
ఏడాదిపాటు చేసిన సేవలకు పులకించిన ప్రకృతి వసంత రుతువులో చెట్టును సన్మానిస్తుంది. అప్పుడు చెట్లన్నీ వసంతోత్సవం జరుపుకొంటాయి.
చెట్టులాగే మానవ జన్మలో ధ్యానం పిండదశలోనే మొదలవుతుంది. తల్లి గర్భంలో శిశువు అవయవాలు ధ్యాన మహత్తు వల్లే పరిపూర్ణంగా రూపుదిద్దుకుంటాయి. తొమ్మిది నెలల కాలంలో కడుపులోపల బిడ్డ కళ్లు తెరవదు. అది ప్రకృతి నియమం. కావాల్సిన సరకులన్నీ ఇంటిలోనే బాగా ఉన్నప్పుడు ఎవరైనా బయటకు వెళతారా ? లేదు. జగత్తులో బ్రహ్మానందం కన్నా మించింది ఏదీ లేదు.
సృష్టిలో కొన్నింటికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వేణుమాధవుడి మురళీ గానానికి గోవులు గోపాలుడి చుట్టూ చేరతాయి. పచ్చని కొమ్మలు కోకిల పాటలు వినడానికి క్షణకాలమైనా చెవులు రిక్కించి ఉంటాయి. ఇవన్నీ శ్రవణానందంతో జరిగే ధ్యానాత్మక ప్రక్రియలు. భరతఖండం గడ్డమీద కొంతమంది శ్రవణం చేస్తూ మోక్షప్రాప్తి పొందినవారూ ఉన్నారు. ధ్యానంలో వినిపించే ప్రణవ నాదానికి ఆకాశంలోని కాస్మిక్ శక్తులు జమగూడి బ్రహ్మరంధ్రం ద్వారా సాధకుడిలోకి ప్రవేశిస్తాయి. మానవ శరీరంలోని రుగ్మతల్ని తరిమి కొడతాయి. వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. అందువల్లే సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ‘సంగీత ప్రక్రియలతో చికిత్సలూ చేయవచ్చు’ అనేవారు.
ఏకకాలంలో అనేక పనులు తక్కువ సమయంలో చేసి ఎక్కువ ఆస్తులు కూడబెట్టాలన్న అత్యాశ మంచిది కాదు. పరుగులాట జీవితం ప్రాకృతిక ప్రామాణికం కాదు. అది సహజ జీవన విధానానికి పూర్తిగా భిన్నమైంది. దానివల్ల అనేక అనర్థాలు సంభవిస్తాయి. జీవన పయనంలో రొప్పుతూ పరుగెత్తడం వల్ల ఆయాసంతో ఆగిపోవడం తప్పదు. తద్వారా పూర్తిచేయాల్సిన కార్యాలన్నీ అర్ధాంతరంగా ఆగిపోతాయి. ఆఖరున మిగిలేది ఫలశూన్యం. కనుకనే ధ్యానాత్మక జీవితం సర్వోన్నతం.