YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

నేత‌ల‌కు కేసుల భ‌యం

నేత‌ల‌కు కేసుల భ‌యం

నేత‌ల‌కు కేసుల భ‌యం
విజ‌య‌వాడ‌
తెలుగుదేశం పార్టీ నేతలకు కేసుల భయం వెంటాడుతుంది. ఎప్పుడు ఏ కేసు నమోదవుతుందోనని, ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనన్న భయం వారిని వెంటాడుతుంది. వరసగా కేసులు నమోదవు తుండటంతోనే వారు ప్రభుత్వంపై విమర్శలకు దిగేందుకు కూడా భయపడుతున్నారు. ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన టీడీపీ నేతల వాయిస్ మాత్రమే కొంత విన్పిస్తుంది. మిగిలిన వాళ్లు నోరు మెదపకపోవడానికి అరెస్ట్ భయమేంటున్నారు.
ఇప్పటికే ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. ఆయన రెండు నెలల పాటు రిమాండ్ లో ఉండాల్సి వచ్చింది. మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా హత్యకేసులో అరెస్ట్ చేశారు. ఈయన కూడా దాదాపు ఒకటిన్నర నెల జైలు జీవితం గడిపి వచ్చారు. ఇక తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి రవాణా శాఖ రిజిస్ట్రేషన్ల కేసులో దాదాపు 58 రోజుల పాటు జైలులో ఉండి ఇటీవలే బయటకు వచ్చారు. వీరందరికీ బెయిల్ లభించడం కొంతలో కొంత ఊరట.ఇక మరో టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇక అయ్యన్న పాత్రుడు పై నిర్భయ కేసు ఇంకా వేలాడుతూనే ఉంది. ముందుగానే ఆయన కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పల పైన కూడా కేసులు నమోదయ్యాయి. వీరందరిని అరెస్ట్ ల భయం వెంటాడుతుంది. వీరితో పాటు మాజీ మంత్రి అఖిలప్రియ పై కూడా హత్యకు కుట్ర జరిపారన్న కేసు నమోదయింది. ఈ కేసు కూడా అఖిల మెడపై కత్తిలా వేలాడుతోంది.అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరామ్ పై పాత కేసులు తవ్వి బయటకు తీశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ అనేక మంది మాజీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. రాజధాని అమరావతిలో భూ వ్యవహారంలో ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదయ్యాయి. దీంతో అధికార పార్టీ ఎక్కడ అరెస్ట్ చేస్తుందోనన్న భయంతోనే టీడీపీ నేతలు బయటకు రావడం లేదు. లేకుంటే చంద్రబాబు పిలుపునకు వీరంతా స్పందించేవారంటున్నారు. కేసుల భయం పోయిన తర్వాతనే వీరంతా నోరు విప్పే అవకాశాలున్నాయి. అప్పటి వరకూ వీరంతా మౌనంగానే ఉండాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పలేదు.

Related Posts