తప్పుటడుగులతో ఐరెన్ లెగ్ ముద్ర
తిరుపతి,
కాలం కలసి రాకపోతే.. తాడు కూడా పామై కరుస్తుందటారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అంతే. ఎన్ని జంప్ లు చేసినా టైమ్ అనుకూలంగా లేకపోతే ఎంత దమ్మున్న నేతైనా చతికల పడక తప్పదు. చిత్తూరు జిల్లాను ఒకప్పుడు శాసించిన నేత ఇప్పుడు కిక్కురుమనడం లేదు. టైమ్ మనది కాదులే అనుకుని కామ్ అయిపోయారు. దాదాపు పదేళ్లకు పైగా ఆయన రాజకీయంగా ఎలాంటి పదవులు లేకుండా ఖాళీగా ఉన్నారు. మరో నాలుగేళ్లు వెయిట్ చేయాల్సిన పరిస్థిితి. ఆయనే చిత్తూరు జిల్లా నాయకుడు జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు.సీకే బాబు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారంటే ఎవరూ చెప్పలేని పరిస్థిితి. ఎందుకంటే ఆయన మొన్నటి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతకు ముందు బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతకంటే ముందు వైసీపీలో ఉన్నారు. అసలు సీకే బాబు కాంగ్రెస్ పార్టీ నేత. సీకే బాబు చిత్తూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ అంటే విపరీతమైన ఇష్టం. ఆయన మరణంతో సీకే బాబు అనేక తప్పటడుగులు వేశారు.2009 ఎన్నికల్లో సీకే బాబు చిత్తూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగడం, వైసీపీలో ఆలస్యంగా చేరడతో 2014 ఎన్నికల్లో సీకే బాబుకు టిక్కెట్ దక్కలేదు. వైసీపీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులుకి మద్దతుగా నిలిచారు. అప్పుడు వైసీపీ గెలవలేదు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి అభ్యర్థి గెలుపునకు మద్దతు ప్రకటించినా టీడీపీ గెలుపొందలేదు. దీంతో సీకే బాబుసత్తా చిత్తూరు నియోజకవర్గంలో ఏంటో తెలిసిపోయింది. రెండు సార్లు సీకే బాబు మద్దతిచ్చిన పార్టీ గెలవలేదు.ప్రస్తుతం సీకే బాబు సైలెంట్ గా ఉంటున్నారు. ఆయనపై అనేక పాత కేసులున్నాయి. తెలుగుదేశం పార్టీలో చేరినా ఆయన ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అధికార వైసీపీతో తగవులు తెచ్చుకోవడం ఎందుకని ఆయన పూర్తిగా మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అనుచరులు మాత్రం వైసీపీలో చేరాలని వత్తిడి తెస్తున్నారు. అయితే ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేయనట్లు తెలుస్తోంది. టీడీపీలోనే కొనసాగాలని, అయితే మరోమూడున్నరేళ్ల పాటు పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని సీకేబాబు సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద సీకే బాబు సైలెన్స్ వెనక పాత కేసులే కారణమంటున్నారు. మరోవైపు ఆయనను ప్రత్యర్థులు ఐరెన్ లెగ్ గా ఎద్దేవా చేస్తున్నారు. సీకే బాబుఎవరికి మద్దతిస్తే వారి ఓటమి ఖాయమన్న జోకులు నియోజకవర్గంలో వినపడుతున్నాయి.