కరోనాతో ప్రసవ వేదన
తిరుపతి,
ఓ వైపు కరోనా అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తుంటే... మరోవైపు గర్భిణులు, బాలింతలకు వైద్యసేవలు సరిగ్గా అందడం లేదు. కరోనా కాలం వీరిని ప్రసవ వేదనకు గురిచేస్తోంది. ప్రభుత్వ వైద్యులు కరోనా విధుల్లో ఉండటంతో తీవ్ర అవస్థలు పడుతున్న గర్భిణుల, బాలింతల ఆవేదన వర్ణణాతీతం. వీరికి సంబంధించిన వైద్యసేవలు ఐదు నెలలుగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రసవ మహిళలకు కనీస వైద్యసేవలు అందలేదని తెలుస్తోంది. నవజాత శిశువులకు ఇచ్చే టీకాలు, గర్భిణులకు వైద్యపరీక్షలు గణనీయంగా తగ్గాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య దారుణంగా పడిపోయింది.
రాష్ట్రంలో గర్భిణులకు ఆరోగ్య, సేవలు, పోషకాహార పంపిణీ, టీకాలు వంటివి అందజేయడంలో అంగన్వాడీ వ్యవస్ధ కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో ఆశా వర్కర్లు, నర్సులు, ఎఎన్‌ఎంలు పాత్ర చాలా ముఖ్యమైంది. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో 30,16,867 మంది గర్భిణులు, బాలింతలు నమోదై ఉన్నారు. లాక్‌డౌన్ కాలంలో పిహెచ్‌సి, సిహెచ్‌సిలో వైద్యసేవలు 90 శాతం నిలిచిపోవడంతో గర్భిణులకు, బాలింతలకు నిర్వహించాల్సిన వైద్యపరీక్షలు, ఇంజెక్షన్లు, టీకాలు, మందులు సంపూర్ణంగా అందలేదు.లాక్‌డౌన్‌లో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు సైతం తగ్గాయి. గతేడాది ఏప్రిల్, మే, జూన్ నెలల మధ్య ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 8.2 లక్షలు కాగా ఈ ఏడాది అదే కాలానికి 3.3 లక్షలకు తగ్గింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు పది లక్షల మంది రిజిష్టర్ చేసుకున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి దాదాపు 6.7 లక్షల మంది ప్రభుత్వ వైద్య సేవలకు దూరమయ్యారని తెలుస్తుంది. ప్రభుత్వాస్పత్రులు, వైద్యులు కరోనా విధుల్లో ఉండటం, గర్భిణులు కూడా కరోనా కాలంలో ఆస్పత్రులకు రావడానికి భయపడటం వల్లే ఆస్పత్రుల్లో ప్రసవాలు తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు.శిశువుకు రెండు, మూడు దఫాలుగా పలు టీకాలు వేయాల్సి ఉంటుంది. శిశువు పుట్టిన మూడో రోజునే బిసిజి జీరో డోస్ కచ్ఛితంగా ఇవ్వాలి. లాక్‌డౌన్ వల్ల వ్యాక్సిన్లు కేవలం 30 నుంచి 35 శాతం శిశువులు మాత్రమే పొందగలిగారు. గతేడాది పోలియో వ్యాక్సిన్ బర్త్‌డోస్ 16.5 లక్షల మంది శిశువులకు ఇచ్చారు. ఈసారి ఈ వ్యాక్సిన్ ఆరు నెలల కాలానికి గాను 5.9 లక్షల మందికి మాత్రమే అందింది.గతేడాది ఏప్రిల్, మే, జూన్‌లలో 32 లక్షల మంది గర్భిణులు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రిజిష్టర్ చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్‌లలో వారి సంఖ్య 22 లక్షలకు పడిపోయింది. నాలుగుసార్లు వైద్యుడి సమక్షంలో వైద్యపరీక్షలు చేయించుకున్న గర్భిణులు నాలుగు లక్షల మంది ఉన్నారు. ఆపరేషన్ కోతలు, ఇతర కారణాలతో శరీరంలో ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడేది యాంటి టెటానస్ ఇంజెక్షన్. దీన్ని రెండు దఫాలుగా ఇస్తారు. ఇది కేవలం 1.5 లక్షల మందికి మాత్రమే అందింది.రాష్ట్రంలో 50 శాతం గర్భిణులు పోషకాహార సమస్యను ఎదుర్కొంటున్నారని తాజాగా ప్రభుత్వమే అంచనా వేసింది. వీరు రక్తహీనత నుంచి బయటపడటానికి ఐరన్ ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ (బి కాంప్లెక్స్ విటమిన్లు) ట్యాబ్లెట్స్ ఇస్తుంటారు. గతేడాది 38 లక్షల మంది గర్భిణులకు ఈ మందులు అందజేయగా, లాక్‌డౌన్ వేళ 7.6 లక్షల మందికి ఇచ్చారు. కరోనా వ్యాప్తితో సరైన మందులు, ఇంజెక్షన్లు అందకపోవడంతో రక్తహీనతతో బాధపడే గర్భిణులు, బాలింతల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు. అయితే వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా వీరికి పౌష్టికాహారం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది.