హీరోలు రెమ్యూనిరేషన్ తగ్గించుకుంటారా
హైద్రాబాద్,
ప్రస్తుత కరోనా మహమ్మారికి ప్రపంచం మొత్తం విలవిల్లాడింది. ఇందులో చిత్ర పరిశ్రమ కష్టాలు అందరికి కన్నీళ్లు తెప్పించే రేంజ్ లోనే ఉన్నాయి. ఈ పరిశ్రమ పై ఆధారపడిన లక్షలాదిమందికి ఆరు మాసాలుగా చెప్పనలవి కాని అవస్థలు కొనసాగుతూనే ఉన్నాయి. షూటింగ్ లు పూర్తి స్థాయిలో లేవు. బుల్లి తెర సీరియల్స్ కొన్ని మొదలైనా అక్కడ కూడా కరోనా కలకలం అంటూ వస్తున్న వార్తలు టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. దాంతో ధైర్యంగా షూటింగ్స్ కి ఎవ్వరు ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరు. ఇక సినిమా డిస్ట్రిబ్యూషన్, థియేటర్ల వరకు అంతా నిస్తేజమే. పూర్తి స్థాయిలో పనిచేసే వ్యాక్సిన్ వస్తే తప్ప పాత రోజుల్లోకి చిత్ర పరిశ్రమ చేరుకోవడం చాలా కష్టమైన వ్యవహారమే.భారీ చిత్రాలు అని చెప్పుకోవడమే కానీ అందులో నటించే హీరో హీరోయిన్స్ కి ఇచ్చే పారితోషికాలకే నిర్మాత చీటీ చిరిగిపోతుంది. దాంతో ఎక్కువ చిత్రాలను టాలీవుడ్ ఇండస్ట్రీ అందించలేని పరిస్థితి ప్రస్తుతం చాలా కాలంగా నడుస్తుంది. ఎక్కువ చిత్రాలు తీయగలిగితే ఎక్కువమందికి పని దొరుకుతుంది. ఎక్కువ థియేటర్లు అవసరం అవుతాయి. కానీ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు చిరంజీవి ట్రెండ్ ముగిసాక నేటి హీరోలు ఏడాదికి ఒకటి అర చిత్రాలు తప్ప ఎక్కువ నటించేందుకు ముందుకు రావడం లేదు. కారణం వారికి కోరినంత ఇచ్చుకోలేనందునే నిర్మాతలు సినిమాలు తీసేపరిస్థితి లేకుండా పోయింది. అదే ఒకప్పటి హీరోలు ఏడాదికి పది చిత్రాల్లో నటించే వారంటే ఎంతమందికి ఉపాధి దొరికేదో చెప్పక చెప్పొచ్చు.ప్రస్తుతం ప్రపంచం కరోనా కు ముందు తరువాత అనే విధంగా నడవనుంది. ఈ నేపథ్యంలో పదిమంది బతికే చిత్ర పరిశ్రమలో హీరోలు జీరో కూడా తీసుకోకుండా కొంతకాలం పనిచేయాలిసి ఉందని హీరో నాని వ్యాఖ్యానించాడంటే సంక్షోభం అర్ధం చేసుకోవాలి. అయితే నాని వంటి చిన్న హీరోలు ఇలా ఎంతో పెద్ద మనసుతో ఆలోచించి చెప్పారు. ఇదే మాట పెద్ద హీరోలనుంచి వచ్చి కొందరైనా ఎక్కవ చిత్రాల్లో తక్కువ పారితోషికంతో నటిస్తే మాత్రం చిత్ర పరిశ్రమ కొంతైనా నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయి. దీనిపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతిఒక్కరు ఆలోచన చేయాలిసిఉంది. అలా ఐక్యంగా అగ్రహీరో లు దర్శకుల, నిర్మాతల ఆలోచన ఏకరూపం దాలిస్తేనే రాబోయే రోజుల్లో చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం దక్కే అవకాశం ఉంది. లేని పక్షంలో ఇప్పటికే ఓటిటి కి కుచించుకుపోయిన వెండితెర మసకబారే ప్రమాదం లేకపోలేదు.