జూనియర్ల తోనే పార్టీకి భవిష్యత్తు
గుంటూరు,
టీడీపీ సీనియర్‌నేత. గుంటూరు కు చెందిన నాయకుడు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం.. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నా గత ఎన్నికల్లో తప్ప ఎప్పుడూ ఆయనకు ఓటమి అనేదే లేదు. పైగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినే నేత. వయసు కూడా పెద్దగా వచ్చిపడిపోయింది ఏమీలేదు. పార్టీకి చాలా ఉపయోగపడాల్సిన స్థాయిలోను, స్థానంలో ఉన్నారు. ఇలాంటి నాయకుడు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. అవసాన దశలో ఉన్న పార్టీని బతికించుకునేందుకు నాయకులు తరలిరావాలంటూ.. తాజాగా చంద్రబాబు ఇచ్చిన పిలుపును ఆయన లైట్ తీసుకున్నారు. “ఇప్పటి వరకు ఎంతో చేశాం. ఏముంది? ఏం గుర్తింపు లభించింది?“ అని సదరు నాయకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు అన్ని జిల్లాల సీనియర్ నేతలతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ఏడాది ఓటమి తర్వాత పార్టీ పుంజుకుందా లేదా ? అనే విషయాలపై ఆయన మాట్లాడారు. అదే సమయంలో జగన్ సర్కారుపై టీడీపీ చేస్తున్న పోరును కూడా ఉటంకించారు. ఈ నేపథ్యంలో పార్టీ రేటింగ్‌పై చర్చ వచ్చినప్పుడు సీనియర్లు మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని, ఏదో ఒక మాధ్యమం ద్వారా ప్రజలకు చేరువ కావాలని, కరోనా ఉందని ఇంటికే పరిమితం కావొద్దని చంద్రబాబు సూచించారు. ఈ ప్రతిపాదనకు చాలా మంది నాయకులు అంగీకారం అయితే తెలిపారు కానీ.. ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు.ఈ నేపథ్యంలోనే గుంటూరుకు చెందిన సీనియర్ నాయకుడు.. ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవిని ఆశించారు. కానీ, బాబు ఇవ్వలేదు. పోనీ.. నామినేటెడ్ పదవినైనా తన సతీమణికి ఇప్పించుకునేందుకు ప్రయత్నించారు. అది కూడా ఇవ్వలేదు. ఈ పరిణామాలతో ఒకింత విసిగిపోయారని, ఎంత చేసినా.. పార్టీలో గుర్తింపు లభించడం లేదని, పార్టీ కోసం కృషి చేసి.. ఇన్నాళ్లలో తాము సాధించింది ఏంటని ఆయన అసహనం, అసంతృప్తి కూడా వ్యక్తం చేశారని తెలిసింది.అక్కడితో ఆగని ఆ సీనియర్ నేత లోకేష్‌ను పక్కన పెట్టేసి జూనియర్ ఎన్టీఆర్‌ను తెరమీదకు తెస్తే తప్ప పార్టీ బతికి బట్టకట్టదు అని కూడా అనడంతో ఇప్పుడు ఈ విషయం టీడీపీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇదే అభిప్రాయం టీడీపీలోనే చాలా మంది నేతలకు ఉన్నా వారు బయటకు అనే పరిస్థితి లేదు. సదరు గుంటూరు సీనియర్ నేత పార్టీ సీనియర్లు, కీలక నేతల సమక్షంలోనే చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఇక ఈ నేత పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సీనియర్ నేతలు ఎదర్కొంటున్నా వారు కక్కలేక మింగలేక చందంగా ఉంటున్నారు