అక్టోబర్ 2 నుంచి చినబాబు సైకిల్ యాత్ర
విజయవాడ,
ఎన్ని చెప్పుకున్నా కూడా టీడీపీ ఆశాకిరణం, పసుపు పార్టీ కుల దీపకుడు నారా లోకేష్ అన్న సంగతిని ఎవరూ కాదనరు. లోకేషే రేపటి నాయకుడు. చంద్రబాబు ఎంత సీరియస్ రాజకీయం చేసినా ఆయన చెప్పుకున్నట్లుగానే అది అయిదారేళ్ళు మాత్రమే. అంటే రేపటి రోజున పసుపు జెండా గట్టిగా ఎగరాలంటే లోకేష్ కూడా ఇంకా డైనమిక్ గా ఉండాలి. జనంలోనే కాదు, పార్టీలోనూ పట్టు పంచుకోవాలి. చంద్రబాబు ఇపుడు చినబాబుకు గైడ్ చేసేందుకే తన టైం అంతా వెచ్చిస్తున్నట్లుగా చెబుతున్నారు. లాక్ డౌన్ కాలాన్ని ఆయన అలా సద్వినియోగం చేసుకుంటున్నట్లుగా కూడా భోగట్టా.ఏపీలో జగన్ యువ నేతగా ఉన్నారు. ఆయన తండ్రి వైఎస్సార్ తో పోరాడిన చంద్రబాబు జగన్ తోనూ పదేళ్ళుగా ఢీ కొంటున్నారు. ఎంత ఫైట్ చేసినా కూడా యూత్ టీడీపీ వైపు టర్న్ కావడంలేదు. దానికి తోడు చంద్రబాబు ఆలోచనలు కూడా అవుట్ డేటెడ్ గా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటితరానికి బాబు కనెక్ట్ కాలేకపోతున్నారు. ఎర్లీ సెవెంటీస్, ఎయిటీస్ రచ్చ బండ రాజకీయాలు చేస్తే ఈ తరం యూత్ ఒప్పరు, పైగా కులాలు మతాలు అంటూంటే కూడా చికాకుగా ఉంది. దీంతో జగన్ కి ధీటైన రాజకీయ నేత టీడీపీకి అవసరం ఉందిపుడు.లోకేష్ బాబు మీద తమ్ముళ్ళకు ఆశలు ఉన్నాయి. సీనియర్లను పక్కన పెడితే యువ నాయకులు బాబు కంటే లోకేష్ నే తమ నేతగా భావిస్తున్నారు. అన్నా జనంలోకి రా అని పిలుస్తున్నారు. జగన్ కి పోటీగా కుమ్మేయాల్సిందేనని కూడా నూరిపోస్తున్నారుట. వీరిలో సీనియర్ల వారసులు ఎక్కువ మంది ఉన్నారు. వైసీపీని తట్టుకోవడం అంటే యూత్ ని ఒడిసిపట్టుకుంటే కుదురుతుందని కూడా వారు నమ్ముతున్నారు. మరో వైపు చంద్రబాబు కూడా లోకేష్ కి ఈ మధ్య స్వేచ్చ ఇస్తున్నారని అంటున్నారు. ఆయన ఆలోచనలకు కూడా విలువ ఇస్తున్నారుట. పార్టీలో జరిగే ప్రతీ విషయం కొడుకుతో చర్చించి తగినట్లుగా నిర్ణయం తీసుకుంటున్నారుట. ఆ విధంగా లోకేష్ లోని తెలివిని వాడుకుంటూ రాజకీయంగా చినబాబుని పదును పెడుతున్నారుట.పార్టీలో ఎటూ యూత్ మద్దతుని లోకేష్ పొందుతున్నారు. సీనియర్లు బాబుతో ఉన్నారు. ఈ క్రమంలో లోకేష్ ని మంచి లీడర్ గా ప్రమోట్ చేసే పనిలో బాబు బిజీగా ఉన్నారుట. ఇక మీదట విలువైన నాలుగేళ్ల కాలాన్ని జనం మధ్యలోనే ఉండేలా లోకేష్ కి సంబంధించిన యాక్షన్ ప్లాన్ డిజైన్ చేస్తున్నారు అంటున్నారు. తాను పార్టీ యాక్టివిటీ చూసుకుంటే చినబాబు జనంలో ఉండాలన్నది బాబు మార్క్ పాలిటిక్స్ గా ఉంది. దాని కోసం సైకిల్ యాత్రకు చినబాబును ప్రిపేర్ చేస్తున్నారు. తనకు అచ్చొచ్చిన అక్టోబర్ 2 ముహూర్తాన్నే చినబాబుకు కూడా పెట్టి మరీ జనంలోకి పంపడానికి బాబు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. గతంలో అంటే 2012 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత ఆయన అధికార పీఠం అందుకున్నారు. ఇపుడు లోకేష్ కి కూడా అదే ముహూర్తం ఖరారు చేస్తున్నారుట. మొత్తానికి లోకేష్ ని జనంలోకి పంపి భావి నాయకుడిగా ఒప్పించాలన్నదే బాబు ఆలోచనగా ఉంది.