నూతన నాయుడుపై రౌడీషీట్
విశాఖపట్టణం,
దళిత యువకుడికి శిరోముండనం కేసులో ఇప్పటికే అరెస్టయిన నూతన్ నాయుడిపై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. శిరోముండనానికి సంబంధించి అతడిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఇప్పటికే కేసు నమోదు కాగా.. రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ పేరును దుర్వినియోగం చేసినందుకు విశాఖ నగరంలోని పెందుర్తి, కంచరపాలెం, గాజువాక, మహారాణిపేట స్టేషన్లలో 8 కేసులు నమోదయ్యాయి. 8297987395 ఫోన్ నెంబరుతో పీవీ రమేష్ పేరును ఉపయోగించి అతడు ఎంత మందిని మోసం చేసి ఉంటాడనేదానిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.నూతన్‌నాయుడు చేతిలో మోసపోయిన వారెవరైనా బయటికి వస్తే అతడిపై మరిన్ని కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఒకే ఫోన్ నంబర్‌తో సుమారు 30 మంది ప్రభుత్వాధికారులతో మాట్లాడినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆ ఫోన్ నంబర్‌కి సంబంధించి 50కి పైనా ఫోన్‌కాల్స్‌ను విశ్లేషిస్తున్నామని, దాని ద్వారా ఏదైనా సమాచారం వస్తే నూతన్ నాయుడు మరిన్ని చిక్కుల్లో పడటం ఖాయమని పోలీసుల వర్గాలు చెబుతున్నాయి.మరిన్ని కేసులు నమోదైతే నూతన్‌నాయుడిపై రౌడీషీట్ తెరిచే అవకాశాలు కూడా ఉన్నాయని వైజాగ్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు భార్య ప్రియా మాధురితో పాటు ఐదుగురిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. కోర్టు అనుమతి గనుక వస్తే నిందితులను విచారించి మరింత సమాచారం రాబడతామని పోలీసులు చెబుతున్నారు.