లిక్కర్‌తో మంచి ఆదాయం
హైద్రాబాద్,
ప్రభుత్వానికి లిక్కర్‌తో ఆగస్టులో మంచి ఆదాయం సమకూరింది. గతేడాదితో చూస్తే ఈసారి 45 శాతం రాబడి పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది ఆగస్టులో లిక్కర్‌తో వచ్చిన ఆదాయం రూ.1397 కోట్లుగా ఉంది. అయితే ఈసారి రూ.2300 కోట్లు వరకు వచ్చింది. ఇక ఈసారి కరోనాతో మే నెలలో రూ.1864 కోట్లు, జూన్‌లో రూ.1995 కోట్లు సమకేరింది. ఇక గతేడాదితో చూస్తే జూలైలో 25 శాతం అధికంగా వచ్చింది. సాధారణంగా రాష్ట్రంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్(ఐఎంఎల్)తో పోలిస్తే బీర్లే ఎక్కువగా అమ్ముడుపోయేవి. అయితే కరోనా ప్రభావం, లాక్‌డౌన్ తరువాత బీర్ల అమ్మకాలు చాలా వరకు తగ్గాయి. అదే సమయంలో ప్రభుత్వం ధరలు పెంచడం ఒక కారణంగా చెబుతున్నారు. గతేడాది ఆగస్టులో 29.7 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోగా, ఈ ఆగస్టులో 16.9 లక్షల కేసులే అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇక లిక్కర్ 27 లక్షల కేసులు అమ్ముడుపోయినట్లు తెలిసింది.బార్లు, క్లబ్బులు పూర్తి స్థాయిలో తెరిచి, కళాశాలలు ప్రారంభమైతే బీర్ల కేసులు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 19 మద్యం డిపోలు ఉన్నాయి. వాటి నుంచి ఆయా ప్రాంతాల్లోని వైన్స్‌లకు లిక్కర్ సరఫరా అవుతుంది. అయితే ఎపి సరిహద్దు జిల్లాల్లో నల్లగొండ, ఖమ్మంలలో ఈసారి ఎక్కువగా లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు మన తెలంగాణకు తెలిపారు. అలాగే వనపర్తి, వరంగల్ రూరల్ జిల్లాల్లోనూ అమ్మకాలు ఎక్కువగా పెరిగాయి. ఎపిలో లిక్కర్ రేట్లు ఎక్కువగా ఉండటంతో పాటు తక్కువ స్థాయిలో విక్రయాలు జరపుతున్నారు. దీంతో సరిహద్దు జిల్లాల్లో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 2221 వైన్స్‌లు ఉన్నాయి. లాక్‌డౌన్‌తో మార్చి 22 నుంచి మే 5 వరకు వైన్స్‌లు బంద్ అయ్యాయి. దీంతో ఖజానాకు రూ.4 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే లో పరిమిత సమయాలతో అనుమతించారు. ఈ క్రమంలో ప్రభుత్వం లిక్కర్ రేట్లను 20 శాతం పెంచింది. అసలే కరోనా అదే సమయంలో రేట్లు పెరగడంతో కాస్త ఆదాయం తగ్గింది.