బాంద్రాలో తన కార్యాలయం కూల్చివేతపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మహరాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. ఠాక్రేపై నిప్పులు చెరుగుతూ హెచ్చరించిన వీడియో సందేశాన్ని తాజాగా ట్విటర్‌లో విడుదల చేశారు. ‘ఉద్ధవ్ ఠాక్రే మీరు ఏమనుకుంటున్నారు. మూవీ మాఫీయాతో చేతులు కలిపి నా భవనాన్ని కూల్చివేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నానని అనుకుంటున్నారా? ఈ రోజు నా ఇల్లు కూలిపోయింది.. రేపు మీ అహంకారం కూలిపోతుంది’’ అంటూ ఈ వీడియోలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైలోని తన కార్యాలయాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ మహరాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసిన తీరును కంగనా కశ్మీర్ పండితుల దుస్థితితో పోల్చారు.
<blockquote class="twitter-tweet"><p lang="hi" dir="ltr">तुमने जो किया अच्छा किया ????<a href="https://twitter.com/hashtag/DeathOfDemocracy?src=hash&ref_src=twsrc%5Etfw">#DeathOfDemocracy</a> <a href="https://t.co/TBZiYytSEw">pic.twitter.com/TBZiYytSEw</a></p>— Kangana Ranaut (@KanganaTeam) <a href="https://twitter.com/KanganaTeam/status/1303636961131782147?ref_src=twsrc%5Etfw">September 9, 2020</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
మనం కాలచక్రంలో ఉన్నామన్న విషయాన్ని ఠాక్రే గుర్తుంచుకోవాలని, అది ఎప్పటికి ఒకేచోట ఉండదని కంగనా హెచ్చరించారు. ‘‘ఒక విధంగా మీరు నాకు సహాయం చేశారు. కశ్మీరీ పండితులు ఎందుకు బాధలు పడుతున్నారో అర్థమైంది, ఈ రోజు అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఈ సందర్భంగా నేను ఓ ప్రతిజ్ఞ చేస్తున్నాను.. ఒక అయోధ్య మీదనే కాదు కశ్మీరీలపై కూడా సినిమా తీస్తాను’’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే గత కొద్ది రోజులుగా కంగనా మహరాష్ట ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. శివసేన, కంగనాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్న తరుణంలో బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) ఇవాళ ఉదయం కంగనా కార్యాలయాన్ని కూల్చివేసింది. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణంగా బీఎంసీ అధికారులు పేర్కొన్నారు.