కొండెక్కిన పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. అమెరికా డాలర్ బలపడటంతో బంగారానికి మదుపరుల నుంచి డిమాండ్ తగ్గుముఖం పట్టింది. ఎంసీఎక్స్‌లో బుధవారం పదిగ్రాముల బంగారం 245 రూపాయలు దిగివచ్చి 51,108 రూపాయలకు తగ్గింది. కిలో వెండి 712 రూపాయలు తగ్గి 67,782 రూపాయలు పలికింది. అయితే బంగారం ధరలు ఇంకా 50,000 రూపాయలకు ఎగువనే కదలాడటంతో సామాన్యులకు పసిడి భారంగానే మారింది.
గత నెలలో రికార్డు స్ధాయిలో బంగారం ధర 56,200 రూపాయలకు చేరుకున్న అనంతరం ఇప్పటివరకూ 5000 రూపాయలు తగ్గడం కొంత ఊరట కలిగిస్తోంది. వెండి సైతం గత నెల ఏకంగా 80,000 రూపాయలకు చేరువై ఆపై భారీగా దిగివచ్చింది.ఇక బంగారం ధరలు మరికొంత కాలం ఒడిదుడుకులతోనే సాగుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.