భాగ్యం అంటే సంపద మాత్రమే కాదు. దివ్యత్వం, గొప్పతనం, మంచి గుణాలు అలవడటం, సాధుస్వభావం, కోరినవి దక్కడం... ఇవన్నీ భాగ్యాలే. యథాతథంగా, కోరుకోనివి సైతం మనసుకు సంతృప్తి, ఆనందం కలిగించే విధంగా అమరడం గొప్ప భాగ్యం. అది దక్కినవారు భాగ్యశాలురు.
భాగ్యశాలురు
‘భగవంతుడు’ అనే పదానికి ‘భాగ్యాలను ఒసగేవాడు’ అనే అర్థం ఉంది. ఆయన అవతరించినదీ భాగ్యాలను ఇవ్వడానికే అని భాగవతం చెబుతోంది.
‘ప్రాణికోటిలో చతుష్పాద జంతువుగా (మానవుల విషయంలో చేతులను సైతం పాదాలుగా పేర్కొని చతుష్పాద జంతువులుగా అనేక చోట్ల వర్ణించారు) జన్మించడమే ఒక భాగ్యం. వాటిలో బుద్ధికలిగి ఉండటం, అందునా మాటల ద్వారా భావవ్యక్తీకరణ చేయగలగడం మానవులకు మాత్రమే కలగడం గొప్ప భాగ్యం’ అని వ్యాస భాగవతంలో ఒక చోట చెప్పించాడు కవి.
ఇంకా ఎందరో భాగ్యశాలుర గురించి భాగవతం వివరంగా చెబుతుంది.
వామనుడు అడిగిన మూడడుగుల నేలదానం ఇవ్వబోయాడు బలిచక్రవర్తి. శుక్రాచార్యుడు వారించాడు. అప్పుడు బలి ‘లక్ష్మీదేవి శరీర భాగాలన్నింటి మీద సరాగ విన్యాసాలు చేసిన, జగదాధారుడైన విష్ణువు చేయి కింద ఉండగా, నా చేయిపైన కావడం కంటే భాగ్యం మరేమి ఉంటుంది?’ అని మురిసిపోయాడు.
నవమ స్కందం యదువంశ చరిత్రలో ‘విష్ణుకళతో జన్మించి, నిరంతర హరినామ సంకీర్తనలు చేస్తూ దైవబలంతో దిక్కులన్నింటినీ గెలిచి యజ్ఞ, దాన, తపస్సులు చేసి, ఎనభై అయిదు వేల సంవత్సరాలు నిత్య యౌవనుడిగా రాజ్యమేలిన కార్తవీర్యుడి భాగ్యం గొప్పది’ అని వర్ణించారు.
భగవానుడి పాదపరాగ రేణువులు సైతం దుర్లభమై యోగులు ఒక పక్క తల్లడిల్లుతుంటే- సాక్షాత్తు ఆ హరితో, చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ కలిసిమెలిసి ఆడుకునే భాగ్యం గోప బాలకలకు కలిగిందని దశమ స్కంధం చెబుతోంది.
నిరంతరం కంసుడి కొలువులో ఉండి అతడి అకృత్యాలు చూస్తున్నా నోరు మెదపలేని స్థితి అక్రూరుడిది. అలాంటి సమయంలో ధనుర్యాగం పేరుతో ఆహ్వానించి శ్రీకృష్ణుణ్ని చంపాలని సంకల్పించాడు కంసుడు. బలరామకృష్ణులను ఆహ్వానించడానికి అక్రూరుణ్ని నియోగించాడు. కృష్ణుడికి ఏమీ కాదని అక్రూరుడికి తెలుసు. ఈ రకంగా ఆ దేవదేవుడి దర్శనం కలిగే అవకాశం తనకు రావడంతో ‘ఎప్పుడు ఏ తపస్సు చేశానో, ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో, నా నుదుట ఏమూల అదృష్టం రాసిపెట్టి ఉందో కాని... మునీశ్వరులు, యోగులకు సైతం దక్కని ఆ బ్రహ్మ స్వరూపుడైన శ్రీహరి దర్శనం నాకు కలగడం ఎంత భాగ్యమో’ అని మురిసిపోయాడు.
సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడికి గురువై, అతడికి విద్యాబుద్ధులు నేర్పించడం, ఆ శ్రీకృష్ణుడే యముడితో పోరాడి, చనిపోయిన తన కుమారుణ్ని తీసుకువచ్చి గురుదక్షిణగా ఇవ్వడం తన భాగ్యంగా సందీపుడు పేర్కొన్నాడు.
రుక్మిణీ కల్యాణ ఘట్టంలో సందేశం పంపి, ఎప్పటికీ సమాధానం రాకపోవడంతో ‘నా భాగ్యమెట్లున్నదో?’ అని శంకించింది రుక్మిణి. ఆమె భయాన్ని తీర్చి, స్వయంగా వచ్చి ఆమెను చేపట్టాడు శ్రీకృష్ణుడు.
కురూపి అయిన కుబ్జకు జగన్మోహనుడైన జగదాధారుడి కరస్పర్శ సోకడమే భాగ్యం. ఆ స్పర్శతో జగదేక సుందరిగా రూపాంతరం చెందడం మహద్భాగ్యం.
నడిరేయిలో ఆ అవతార పురుషుణ్ని తరలిస్తున్న వసుదేవుడికి దారిచ్చి బాలుడి రూపంలో ఉన్న విష్ణు పదస్పర్శ తనకు తగిలే భాగ్యాన్ని పొందింది యమున. ఆదిమధ్యాంత రహితుడైన పరమాత్మకే తల్లికాని తల్లిగా మారి మాతృత్వ మధురిమలు చవిచూసిన భాగ్యం యశోదది.
కలియుగ వాసులకు అయాచితంగా అమరిన వరం భాగవతం. ఆ వరాన్ని అందుకుని, విని, చదివి, చెప్పి, ప్రచారం చేసి ఆస్వాదించిన వారంతా భాగ్యశాలురే.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో