కడప, సెప్టెంబర్ 11,
రాజకీయాలన్నాక.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అది సొంత పార్టీలో నేతల విషయంలో అయినా.. ప్రత్యర్థి పార్టీలో నేతల విషయంలో అయినా. ఈ వ్యూహం, ఎదురుదాడి.. అవసరమైతే.. పైచేయి సాధించే లక్షణం వంటివి లేకపోతే.. నేతలు ఎంత పెద్ద స్థానంలో ఉన్నప్పటికీ.. చిక్కులు కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి కడప జిల్లా కడప నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్ మంత్రి అంజాద్ బాషాకు ఎదురవుతోంది. రాష్ట్రానికి మంత్రిగా ఉన్నా ఆయన మాట నియోజకవర్గంలోనే చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదట. కడప జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులే కారణం. అంజాద్ బాషాకు అతి వినయం ఎక్కువ. అంతా మావాళ్లో.. అనుకునే తత్వమూ ఎక్కువే. ఈ రెండు ఇప్పుడు ఆయనకు పీకల్లోతు కష్టాలు తెచ్చిపెడుతున్నాయినియోజకవర్గంలో ఆయన దూకుడుగా ఉండకపోవడానికి ప్రత్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నా.. చెక్ పెట్టకపోవడానికి కూడా ఇవే కారణంగా మారుతున్నాయని అంటున్నారు. కడపలో ఎంపీ అవినాష్ రెడ్డి దూకుడు ఎక్కువగా ఉంది. అదే సమయంలో ఎమ్మెల్యే, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి జిల్లా మొత్తాన్ని చక్కబెడుతున్నారు. ఇక రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి హవా కూడా జిల్లాలో ఉంది. ఇక, జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్.. అంతా తానే అయి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైఎస్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జిల్లా మంత్రిగా అంజాద్ బాషాకు ఆహ్వానం కూడా అందలేదంటే.. ఏరేంజ్‌లో ఇక్కడ ఆయనను లైట్ తీస్కొంటున్నారో తెలుస్తోంది.పైగా మైనార్టీ నేతలకు న్యాయం చేయలేకపోతున్నానే ఆవేదన అంజాద్ బాషాలో ఉంది. ఇక, అంజాద్ గెలుపు మొత్తం.. తమ ఘనతేనని కొందరు వైసీపీ నాయకులు సైతం ప్రచారం చేసుకుంటున్నారు. అయినా.. కూడా అంజాద్ బాషా మౌనం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ.. ఆయన ఎక్కడా ప్రెస్ మీట్ నిర్వహించే సాహసం చేయలేక పోతున్నారు. పైగా తానుఏం చేస్తున్నారో కూడా ఆయనకే తెలియని పరిస్థితి. కొన్ని విషయాలు ఆశ్చర్యంగా అనిపించినా.. ఇటీవల కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కడప పరిస్థితులపై సీఎం జగన్ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను పక్కన పెట్టి.. ఈ జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ నుంచి వచ్చిన నివేదికకు (ఆయన కరోనాతో భేటీకిరాలేదు) ప్రాధాన్యం ఇచ్చారంటే..అంజాద్ బాషా పరిస్థితి ఏరేంజ్‌లో దిగజారిందో అర్ధమవుతుందని ఆయన అనుచరులే కాదు. నియోజకవర్గం లోనూ వినిపిస్తున్న టాక్.ఇక జగన్ కేబినెట్లో ఉన్న మంత్రుల్లో కొందరు రెండు, మూడు జిల్లాలను ఏలేస్తుంటే.. మరి కొందరు తమ సొంత జిల్లా వరకు తిరుగులేని రారాజులుగా చలామణి అవుతున్నారు. అంజాద్ బాషా పరిస్థితి పూర్తిగా రివర్స్. రాష్ట్ర వ్యాప్తంగా తన శాఖనే ఆయన నిర్వర్తించలేని సంగతి పక్కన పెడితే… తన జిల్లాలో ఆయన ఏం మాట్లాడే పరిస్థితి లేదు. జిల్లా అంతటా రెడ్డి వర్గం ఎమ్మెల్యేలతో పాటు ఈ వర్గం నేతల హవానే ఉంది. వీరు మంత్రిగా ఉన్న అంజాద్ బాషాను పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరికి ఏ పని కావాల్సినా సొంతంగానే చేసుకునే సత్తా ఉన్నవారే. ఇక సొంత నియోజకవర్గం కడప జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ కూడా జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, జగన్ బంధువుల పెత్తనమే ఉంది. చివరకు సొంత నియోజకవర్గంలో కూడా అంజాద్ బాషా మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేకపోవడంతో ఆయన మౌనంగానే ఉండడం తప్పా మంత్రిగా ఉన్నా చేసేదేం లేదు.