విజయవాడ, సెప్టెంబర్ 11,
గతంలో చంద్రబాబు ఐదేళ్లు చేసిన తప్పునే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా చేస్తున్నారు. చంద్రబాబు ఓటమి తర్వాత దానిని గుర్తించారు. జగన్ అధికారంలో ఉండగానే గుర్తించకపోతే వైసీపీకి కూడా టీడీపీకి పట్టిన గతే పడుతుంది. ఇది వైసీపీలో విన్పిస్తున్న మాటలు. వైసీపీ క్యాడర్ ఇప్పుడు పూర్తిగా నైరాశ్యంలో ఉంది. అధికారంలోకి వస్తే తామే కీలకమవుతామని భావించిన వారిని కూడా ఇప్పుడు పార్టీ పట్టించుకోవడం లేదు.జగన్ ముఖ్యమంత్రి కావాలని దాదాపు ఎనిమిదేళ్లు పాటు జెండా పట్టుకుని పార్టీ పటిష్టత కోసం కృషి చేశారు. జగన్ సీఎం కావాలన్న లక్ష్యంతోనే వారు అనేక కేసులను కూడా ఎదుర్కొన్నారు. తీరా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ప్రాధాన్యత లేదు. కేవలం ఐఏఎస్, ఐపీఎస్ ల చట్టంలోనే జగన్ ఉండిపోయారు. వారు చెప్పినట్లే జగన్ నడుచుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న ఫీడ్ బ్యాక్ ను జగన్ క్యాడర్ నుంచి తీసుకోవడం లేదు.గతంలో చంద్రబాబు సయితం ఐఏఎస్, ఐపీఎస్ ల మీదనే ఆధారపడ్డారు. పార్టీని ఐదేళ్ల పాటు పూర్తిగా గాలికి వదిలేశారు. క్యాడర్ తో కనీసం మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా గత ఎన్నికల్లో 23 స్థానాలకే చంద్రబాబు పరిమితమయ్యారు. చంద్రబాబుకు తాను చేసిన తప్పు ఇప్పుడు తెలిసొచ్చింది. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తున్న పిలుపులకు కూడా క్యాడర్ నుంచి స్పందనలేదు. ఇది గమనించిన చంద్రబాబు ఇకపై పార్టీని నిర్లక్ష్యం చేయనని పదే పదే క్యాడర్ తోచెబుతున్నారు. రేపు జగన్ కు కూడా ఇదే పరిస్థతి రాదన్న గ్యారంటీ అయితే లేదు.జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. ఇప్పటి వరకూ జగన్ పార్టీ ఎమ్మెల్యేలతోనే సమావేశం కాలేదు. అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో తలెత్తాయి. జిల్లాల వారీగా బాధ్యతలను కొందరికి అప్పగించిన జగన్ తాను మాత్రం తాడేపల్లి నివాసానికే పరిమితమయ్యారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేలు కూడా క్యాడర్ విషయంలో చేతులెత్తేశారు. జగన్ చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నారు. ఇప్పటికైనా మేలుకోకుంటే పార్టీని జగన్ కాదు కదా? ఈసారి ప్రశాంత్ కిషోర్ కూడా రక్షించలేరన్న టాక్ ఫ్యాన్ పార్టీలో నడుస్తుంది.