YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

లైంగికవేధింపులే మహిళల ఆత్మహత్యలకు కారణమా?

లైంగికవేధింపులే మహిళల ఆత్మహత్యలకు కారణమా?

హైదరాబాద్ సెప్టెంబర్ 11,
దేశంలో ప్రతిరోజూ ఎంతోమంది మహిళలు యువతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సాధారణ గృహిణులు ఉద్యోగిణులు టీవీ కళారంగాలకు చెందిన వారు కూడా తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రధానకారణం మగవాళ్ల లైంగికవేధింపులేనని ఓ సర్వే తేల్చింది. మహిళలు.. పురుషులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వారికి ఆఫీసుల్లో లైంగిక వేధింపులు తప్పడం లేదట. ఎంతో నైపుణ్యంతో పనిచేస్తున్నప్పటికీ కార్పొరెట్ రంగంలో యువతులకు పై అధికారులు తోటి ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని సర్వే వెల్లడించింది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్న యువతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ' ది బీఎంజే పత్రిక ' పనిప్రదేశాల్లో జరుగుతున్న లైంగికవేధింపులపై గతంలో సంచలన కథనం ప్రచురించింది. ఈ కథనం తర్వాత హాలీవుడ్లో ‘మీటూ’ అనే ఓ ఉద్యమం మొదలైంది. అక్కడి నుంచి ఈ ఉద్యమం అన్నిదేశాలకు అన్ని రంగాలకు వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎంతోమంది మహిళలు ముందుకొచ్చి తాము ఎదుర్కొన్న లైంగికవేధింపులను నిస్సంకోచంగా నిర్భయంగా చెప్పారు. అప్పటి నుంచి కొంతమేర లైంగికవేధింపులు తప్పినప్పటికీ పూర్తిస్థాయిలో మాత్రం కాదు. కొన్ని కంపెనీలు తమ పరిధిలో లైంగికవేధింపులను అరికట్టేందుకు కొంతమేర చర్యలు చేపట్టాయి. అయితే సమాజంలో మహిళలపై పురుషులకు ఉన్న దృష్టికోణం మారనంత వరకు ఈ పరిస్థితిలో మార్పు రాదన్నది నిజం. స్వీడన్కు చెందిన స్టాక్హోమ్ వర్సిటీ మహిళలపై కొనసాగుతున్న వేధింపులపై ఇటీవల ఓ అధ్యయనం చేసింది. ఈ సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. 85205 మంది మహిళలతో ఈ వర్సిటీ సభ్యులు మాట్లాడారు. గత 12 నెలల్లో వీరు ఏ విధమైన వేధింపులకు గురయ్యారు? తోటి ఉద్యోగులు వాళ్లతో ఎలా వ్యవహరించారు. కిందిస్థాయి ఉద్యోగులు కూడా వేధించారా? తదితర ప్రశ్నలు అడిగారు. అయితే అందులో అత్యధికశాతం మంది తాము లైంగిక వేధింపులకు గురైనట్టు చెప్పారట. 12 నెలల్లో లైంగిక వేధింపులకు గురయ్యామని ఆత్మహత్యలకు యత్నించామని 4.8 శాతం మహిళలు చెప్పారట. ఒంటరి మహిళలు విడాకులు తీసుకున్నవారు..తక్కువ జీతం తీసుకునేవారు ఎక్కువగా లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు తోటిఉద్యోగులతో పాటు కిందిస్థాయి ఉద్యోగుల వేధింపులతోనే మహిళలు ఎక్కువగా ఆత్మహత్యలకు గురవుతున్నట్టు ఈ అధ్యయనంతో తేలింది.

Related Posts