ముంబై, సెప్టెంబర్ 11,
కరోనా వైరస్ కారణంగా క్రూడ్ డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడొచ్చని క్రూడ్ ఉత్పత్తి దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే ఈ దేశాలు క్రూడ్ ధరలు తగ్గించేశాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దిగొచ్చాయి. క్రూడ్ ఉత్పత్తికి తగినట్లుగా డిమాండ్ లేకపోవడంతో ఓపెక్ దేశాలు కూడా ముడి చమురుపై తగ్గింపు అందిస్తున్నాయి.క్రూడ్ ధరలు దిగివస్తుండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గొచ్చు. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుందో చెప్పడం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో డిమాండ్ పడకేసింది. దీంతో క్రూడ్ కంపెనీలు ధరలను తగ్గించేస్తున్నాయి. అక్టోబర్ నాటికి క్రూడ్ ధర బ్యారెల్‌కు 32 డాలర్లకు తగ్గొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 40 డాలర్ల సమీపంలో కదలాడుతోంది.ఇటీవలనే అంటే బ్రెంట్ క్రూడ్ ధర 5 శాతం, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 7 శాతానికి పైగా పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ 40 డాలర్ల కిందకు, డబ్ల్యూటీఐ క్రూడ్ 36 డాలర్లకు పతనమైంది. జూన్ 15 నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. క్రూడ్ ధరలు తగ్గడం భారత్‌కు కలిసొచ్చే అంశం. మన దేశంలో 80 శాతం క్రూడ్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ధరలు తగ్గడంతో దిగుమతి భారం దిగివస్తుంది.ముడి చమురు ధర 20 శాతం మేర దిగివస్తే.. అప్పుడు మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 5 శాతం మేర తగ్గుతాయి. అంటే రానున్న రోజుల్లో లీటరుకు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గొచ్చు. వాహనదారులకు ఇది ప్రయోజనం కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.ఇకపోతే ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగాయి. దేశీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 85.21 వద్దనే కొనసాగుతోంది. అలాగే డీజిల్ ధర కూడా స్థిరంగా రూ.79.62 వద్ద ఉంది. కాగా నిన్న పెట్రోల్, డీజిల్ ధరలు దిగొచ్చిన విషయం తెలిసిందే.