విజయవాడ, సెప్టెంబర్ 12,
రధం చుట్టూ రాజకీయాలు చేయడంతో బీజేపీది అందె వేసిన చేయి. రధయాత్రల మీద, రధాల మీద పూర్తి పేటెంట్ హక్కులు బీజేపీకే ఉన్నాయన్నది నిజం. 1990లలో బీజేపీ నేత అద్వానీ రధ యాత్రే కదా కేంద్రంలో ఈ రోజు బీజేపీకి ఈ పొజిషన్ తెచ్చిపెట్టింది. బహుశా దాన్నే స్పూర్తిగా తీసుకున్నట్లుగా ఉంది. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రధాన్ని లాగితే తమకు ఏపీలో స్పేస్ దొరుకుతుందని బీజేపీ నేతలు ఆశపడుతున్నారులా ఉంది. రధం కింద జగన్ సర్కార్ని పెట్టి తొక్కించేయాలని బీజేపీ జనసేనతో కలసి ఆడిన రాజకీయానికి వైసీపీ తనదైన శైలిలో గట్టి రిటార్టు ఇచ్చింది. మీ రధం, మీ కేంద్రం అంటూ ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకే ఈ కేసు అప్పగించి జగన్ చేతులు దులుపుకున్నారు.జగన్ ఈ నిర్ణయం తీసుకుంటారని బీజేపీ అసలు ఊహించలేదు. అందుకే షెడ్యూల్ ప్రకారం వరసగా ఆందోళనా కార్యక్రమాలను ప్రకటించుకుంటూ పోయింది. అయితే జగన్ ఆపై ఎత్తు వేసి మరీ బీజేపీని చిత్తు చేశారు. రధం పేరిట సాగుతున్న రాజకీయ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. తనకు తానుగా సీబీఐ విచారణకు రెడీ అయి ఆ క్రెడిట్ కూడా విపక్షానికి దక్కకుండా చేశారు. దీని వల్ల జగన్ కి అర్జంటుగా రెండు లాభాలు కలిగాయి. ఒకటి రధం తలనొప్పి పోయింది. రెండవది కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ కాబట్టి బీజేపీ ఇక నోరెత్తదు, ఈ ఘటనతో హిందువులతో పాటు అందరూ తన చిత్తశుధ్ధిని కూడా చూసే వీలుంటుంది.బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి చెందిన నాయకుడే ఏపీ ప్రెసిడెంట్ అయితే ఎక్కడికో పార్టీ వెళ్ళిపోతుందని గత నెలరోజులుగా కమలనాధులు సంబరపడ్డారు, జబ్బలు చరిచారు, ఇంకేముందు ఆమడ దూరంలో సీఎం కుర్చీ అంటూ ఉబలాటపడ్డారు. దానికి తగినట్లుగా సోము మాటల్లో దూకుడు చూపించారు. పాతిక శాతం ఓటు బ్యాంక్ తమదని అన్నారు. జనసేనతో కలసి దున్నేస్తామని చెప్పుకొచ్చారు. ఆయన ప్రెసిడెంట్ అయ్యాక అంతర్వేది రధం దగ్దం ఘటన మీద చేసినదే అతి పెద్ద ఆందోళన. ఈ దెబ్బకు వైసీపీకి చుక్కలు చూపించాలని సోము అతి చేసినట్లున్నారు. కానీ రెండు రోజులు కాకముందే జగన్ వ్యూహాత్మకంగా కధను అడ్డం తిప్పారు. దాంతో బీజేపీ పాలపొంగు అణిగింది. పోరాటం తుస్సుమంది.ఏపీలో బీజేపీ నేల విడిచి సాము చేస్తే ఇలాగే ఉంటుంది అని అంటున్నారు. మతాలను అడ్డం పెట్టుకుని ఎదుగుదామని చూస్తే ఇది యూపీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల మాదిరిగా కాదుగా. ఆ సంగతి మరచిన కమలదళం సై అంటూ తొడకొట్టింది. అందుకే ఏపీలోని ఆస్తిక జనం కూడా మొదట రధం దహనం మీద బాధపడినా కూడా ఆ తరువాత చిల్లర రాజకీయం చూసి వెనక్కి తగ్గిపోయారు. ఏపీలో ఎపుడూ హిందూ కార్డు పనిచేయదు. కానీ సోము మాత్రం వస్తూనే దాని మీదనే ప్రయోగం చేశారు. ఇపుడు బీజేపీ ఊపు కూడా తగ్గిపోయేలా చేశారు అధికారంలోకి రావాలంటే దగ్గర దారులు ఉండవన్న సంగతి ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. కులాలను, మతాలను అడ్డం పెట్టుకుంటే ఓట్లు రాలే రోజులు కావు. జనంలో ఉండాలి, చరిష్మా కూడా ఉండాలి. ఎటూ కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉందిగా. ఏపీకి దండీగా నిధులు తెచ్చి తామే గొప్ప అని సోము అండ్ కో చెప్పుకోవచ్చుగా. అపుడు కొంతైనా ఏపీ జనం ఆ వైపుగా మొగ్గుతారేమో