మంచు తుఫాను, తీవ్రమైన చలిగాలులు, మంచు వర్షాలు, వడగండ్లతో మధ్య అమెరికా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలిగాలుల ధాటికి నిద్రలో ఉన్న రెండేండ్ల బాలిక సహా ముగ్గురు మృత్యువాత పడ్డారు. గల్ఫ్ కోస్ట్ నుంచి గ్రేట్ లేక్ వరకు విస్తరించిన భారీ మంచు తుఫాను మధ్య అమెరికాను ముంచెత్తింది. భారీ మంచు, గాలులు, వర్షంతో కూడిన తుఫాను ధాటికి ముగ్గురు మృతి చెందారు. తుఫాను అతలాకుతలం చేస్తుండటంతో అధికారులు స్నో ఎమర్జెన్సీ ప్రకటించారు. అమెరికా దక్షిణ ప్రాంతంలో టోర్నడోలు, ఉరుములతో కూడిన గాలి వానలు ప్రజల్ని భయకంపితుల్ని చేశాయి. మిన్నెసోటా, నెబ్రాస్కా, లోవా, దక్షిణ డకోటా ప్రాంతాల్లో అధికారులు తుఫాను హెచ్చరికలు జారీ చేశారు.గల్ఫ్ తీరం నుంచి ఉత్తర అమెరికాలోని గ్రేట్ లేక్స్ దిశగా కదులుతున్న తుఫాను మధ్య అమెరికా ప్రాంతాన్ని ముంచెత్తుతున్నది. ఈ ప్రాంతంలో రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించడంతోపాటు విమాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై మంచు భారీగా పేరుకుపోతున్నది. ఈ ప్రారంభ వసంతకాల తుఫాను ఎగువ మధ్యపశ్చిమ రాష్ర్టాల్లో సూర్యరశ్మి, వెచ్చదనం లేకుండా చేసింది. మంచువర్షాల కారణంగా మిన్యాపోలిస్‌లోని సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన దాదాపు 400 విమానాలు విమానాశ్రయంలోనే నిలిచిపోయాయి. మరోవైపు సౌత్‌డకోటాలోని అతిపెద్ద పట్టణమైన సియోక్స్ ఫాల్స్ ఎయిర్‌పోర్ట్ వరుసగా రెండోరోజు కూడా మూతపడింది. మిన్యాపోలిస్‌లో జరుగాల్సిన బేస్‌బాల్ పోటీలు రెండోరోజు కూడా రద్దయ్యాయి.