YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖ‌పైనే ప‌వ‌న్ గురి

విశాఖ‌పైనే ప‌వ‌న్ గురి

విశాఖ‌ప‌ట్ట‌ణం, సెప్టెంబ‌ర్ 14,
పవన్ కళ్యాణ్ కి విశాఖకు చాలా అనుబంధమే ఉంది. ఆయన సినీ నటుడు కాకముందే విశాఖలోనే శిక్షణ తీసుకున్నారు. ఇక పవన్ సినిమాలకు విశాఖలోనే కలెక్షన్లు ఎక్కువ. పవన్ విశాఖలోని గాజువాక నుంచే తొలిసారి పోటీ చేశారు. ఇక జనసేనానిగా పవన్ కళ్యాణ్ విశాఖ నుంచే తన ప్రతీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే గత ఎన్నికల్లో పవన్ ను విశాఖ జనం ఓడించడంతో ఆయన కొంత కాలం ముఖం చాటేశారు. అయితే గత ఏడాది చివర్లో విశాఖలో లాంగ్ మార్చ్ చేపట్టి పార్టీలో కొత్త కదలిక తెచ్చారు. ఆ తరువాత మాత్రం పవన్ కళ్యాణ్ ఈ వైపుగా రావడం మానేశారు.ఇక రాజకీయంగా చూసుకుంటే జనసేన కూడా టీడీపీ విధానాన్నే అనుసరిస్తూ వస్తోంది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని చంద్రబాబు నినదిస్తూంటే పవన్ కళ్యాణ్ సైతం అదే కరెక్ట్ అంటున్నారు. తాజాగా హైకొర్టుకు అఫిడవిట్ ఇచ్చిన దాన్లో కూడా ఆయన అమరావతికే న్యాయం చేయమని కోరారు. విశాఖ సహా మూడు రాజధానుల ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. తనను సినిమాల పరంగా ఆదరించినా రాజకీయంగా దెబ్బేసిందన్న బాధతోనే పవన్ అలా చేశారని వైసీపీ విమర్శించినా కూడా పవన్ కళ్యాణ్ స్టాండ్ మాత్రం ఆది నుంచి అమరావతే అని జనసైనికులు గట్టిగా సమర్ధించుకుంటున్నారు.కరోనా కారణంగా గత ఆరు నెలలుగా ఇంటికే పరిమితం అయిన పవన్ కళ్యాణ్ మెల్లగా జనంలోకి రావాలనుకుంటున్నారుట. ఈ టూర్లో భాగంగా ఆయన విశాఖకు వస్తారని జనసైనికులు చెబుతున్నారు. తాను విశాఖ తొందరలోనే వస్తానని పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్థానిక క్యాడర్ కి సమాచారం ఇచ్చారని అంటున్నారు. ప్రజా పోరాట యాత్రను రెండేళ్ళ క్రితం ఇక్కడ నుంచే ప్రారభించిన పవన్ కళ్యాణ్ మరోమారు ఏదైనా రాజకీయ కార్యక్రమాన్ని విశాఖ వేదికగా చేసుకుని మొదలుపెడతారా అన్న ఆసక్తి జనసైనికుల్లో కనిపిస్తోంది.చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్నే విశాఖ నగరంలోకి రానీయకుండా ఎయిర్ పోర్టులో అడ్డుకున్న జనం పవన్ కళ్యాణ్ ను విశాఖ టూర్ చేయనిస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. విశాఖ రాజధాని వద్దు అన్న పవన్ కి ఈ ప్రాంతం సెగను చూపించాలని వైసీపీ ఎపుడో ఫిక్స్ అయిపోయింది. అయితే తమ నాయకుడు టూర్ చేస్తే జన సంద్రమే ఆయన చుట్టూ ఉంటుందని, వారిని అడ్డుకోవడం వైసీపీ తరం కాదని జనసైనికులు అంటున్నారు. మరో వైపు విశాఖ జనం రాజధాని పట్ల పెద్దగా మొగ్గు చూపడంలేదన్న నివేదికలు పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నాయట. అందుకే ఆయన డేరింగ్ గా విశాఖ టూర్ కి రంగం సిధ్ధం చేసుకుంటున్నారు అంటున్నారు. విశాఖ నుంచే జగన్ పాలన మీద ఎలుగెత్తి విమర్శలు చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు అంటున్నారు. మరి పవన్ కి విశాఖ జనం మీద ఆశలు అలాగే ఉన్నాయని, 2024లో తిరిగి తనను, తన పార్టీని ఆదరిస్తారని గట్టిగానే నమ్ముతున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. చూడాలి మరి.

Related Posts