కడప, సెప్టెంబర్ 14,
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఇప్పుడు పార్టీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయా ? ఒకప్పుడు దేనిపై అయితే.. వ్యతిరేకంగా పోరాడారో.. ఇప్పుడు దానినే కావాలని పట్టుబట్టడం.. వ్యతిరేకతకు దారితీస్తోందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట రిజర్వాయర్ ఫేజ్-2లో 23 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెంచే పనులను త్వరగా పూర్తి చేయాలని జగన్ సంకల్పించారు. దీనిద్వారా.. నియోజకవర్గంలోని ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు అందడంతోపాటు తాగు నీటికి కూడా ఇబ్బందులు తప్పుతాయి.గతంలో చంద్రబాబు కూడా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే, అప్పట్లో వైసీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టు వల్ల తాళ్ల ప్రొద్దుటూరుతో పాటు మరో 16 గ్రామాలు ముంపునకు గురవుతాయని, ఇక్కడి ప్రజలను వేరే చోటకి తలరించాల్సి ఉంటుందని వైసీపీ నేతలు అప్పట్లో పేర్కొంటూ.. ప్రజలు ఉద్యమించేలా చేశారు. నిర్వాలసితులకు పరిహారం చెల్లించాలని, పునరావాసం కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే, అప్పట్లో ఓ ప్యాకేజీని ప్రకటించిన చంద్రబాబు.. దీనిపైనా విమర్శలు రావడం, ప్రజలు వ్యతిరేకించడం, ఈలోగా ఎన్నికలు రావడంతో ఆ పనులు నిలిచిపోయాయి.ఇక, ఇప్పుడు కడప నుంచి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న జగన్‌కు ఈ గండికోట ప్రాజెక్టు ప్రాణసంకటంగా మారింది. పూర్తి చేయకపోతే. రైతులు ఫైరవుతారు. మావోడు సీఎంగా ఉండి.. మాకేం చేశారని వారు ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడానికి జగన్ వద్ద సరుకు లేదు. పోనీ.. పూర్తి చేయాలని ప్రయత్నిస్తే.. గతంలో వచ్చిన వ్యతిరేకతే ఇప్పుడు ఆయనకు కూడా ఎదురవుతోంది. ఇటీవల తాళ్లపొద్దూరులో ప్రజలు రోడ్డు మీదకు వచ్చి గండికోట రిజర్వాయర్ కన్నా ముందు తమ పరిహారాన్ని తేల్చాలని పట్టుబట్టారు. వీరు కోరుతున్న మొత్తం ఇచ్చేందుకు, పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాజెక్టులపై భారీగా వ్యయం చేసే పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం లేదు. పోనీ సొంత జిల్లా కావడంతో పట్టుబట్టి గండికోటను పూర్తి చేయాలన్నా పరిహారం, పునరావాసం విషయంలో అనేకానేక సంకటాలు తప్పవు. ఈ ప్రాజెక్టు మాత్రమే పూర్తయితే మిగిలిన జిల్లాల ప్రాజెక్టులు కదలకపోతే అదీ జగన్‌కు ఇబ్బందే. ఈ నేపథ్యంలో గండికోట జగన్‌కు ఇప్పుడు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టిందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లోగా దీనిని పూర్తి చేయాల్సిన అవసరం ఉండడం, పెరుగుతున్న వ్యతిరేకతలు వంటివి పార్టీపైనా ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.