నెల్లూరు, సెప్టెంబర్ 14,
నెల్లూరు జిల్లా అధికార వైసీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఎన్నికల బరిలో దిగిన దగ్గర నుంచి జిల్లాలో టీడీపీకి పరాజయాలే ఎక్కువ వస్తున్నాయి. 2014లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా సరే నెల్లూరులో వైసీపీ హవానే నడిచింది. మొత్తం 10 సీట్లలో వైసీపీ 7 గెలిచి సత్తా చాటింది. టీడీపీ 3 సీట్లకే పరిమితమైంది. ఇక నెల్లూరు ఎంపీ సీటు సైతం వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే పడింది. ఐదేళ్లు అధికారంలో ఉన్నా కూడా చంద్రబాబు ప్రజల్లో గెలిచిన నేతలను కాదని ఎన్నికల్లో ఓడిన సోమిరెడ్డికి, ఎన్నికల్లో పోటీయే చేయని నారాయణకు మంత్రి పదవులు కట్టబెట్టారు. సోమిరెడ్డి చాలా నియోజకవర్గాల్లో గ్రూపులు ఎంకరేజ్ చేయడంతో జిల్లాలో టీడీపీ సర్వనాశనం అయ్యిందన్న విమర్శలు ఉన్నాయి.ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసి టీడీపీకి గుండు సున్నా మిగిల్చింది. పైగా వైసీపీ అధికారంలోకి రావడంతో జిల్లాలో టీడీపీ అడ్రెస్ లేకుండా పోతుంది. అసలు ఓడిపోయిన తర్వాత టీడీపీ నాయకులు కంటికి కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసిన నాయకులు అధికారం కోల్పోగానే ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. జిల్లాకు పెద్దగా ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం మీడియా సమావేశాలకే పరిమితమైపోయారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కోవూరు, నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో చాలా స్థానాలు అధికార పార్టీకి ఏకగ్రీవం అయిపోయాయంటే టీడీపీ పరిస్థితి ఎంs దారుణంగా ఉందో తెలుస్తోంది.ఇక జిల్లా టీడీపీలో ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రాయాదవ్ ఒక్కడు మాత్రమే యాక్టివ్‌గా ఉంటూ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల విషయానికి వస్తే జిల్లా టీడీపీలో ఎవరు బయటకొచ్చినా, లేకపోయినా నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాత్రం నిత్యం పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు. మొన్న ఎన్నికల్లో సిటీ నుంచి పోటీ చేసి మాజీ మంత్రి నారాయణ, అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓడిపోయాక నారాయణ తన వ్యాపారాలు చూసుకుంటున్నారు. దీంతో చంద్రబాబు కోటంరెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా పెట్టారు.ఇక అప్పటి నుంచి కోటంరెడ్డి దూకుడుగా పనిచేసుకుంటున్నారు. ఓ వైపు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకుంటూనే, మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ధైర్యంగా వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తిచూపిస్తున్నారు. ఆ మధ్య కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించడంపై కూడా గట్టి పోరాటం చేశారు. జిల్లాలో ఏ సమస్య ఉన్నా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విజయవంతం చేస్తున్నారు. మిగిలిన వారిలో సూళ్లూరుపేట, కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి ఇన్‌చార్జ్‌ల గురించి చెప్పుకోవడానికేం లేదు. కోటంరెడ్డి తర్వాత వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ, గూడూరులో అనిల్ మినహా ఎవ్వరూ యాక్టివ్‌గా ఉండడం లేదన్న టాక్ ఉంది. 2014లో ఓడిన శ్రీథర్ కృష్ణారెడ్డి, ఇక నారాయణ కూడా వైసీపీకి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాత్రమే గట్టిగా పోరాటం చేస్తున్నారు. ఏదేమైనా చాలా రోజులకు జిల్లా కేంద్రంలో టీడీపీకి ఓ గట్టి నేత దొరికాడనే నెల్లూరు తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు