ఏలూరు, సెప్టెంబర్ 14,
విద్యా-వైద్యం-ఉపాధి……” సగటు మనిషి ఎవరైనా కోరుకునేది వీటినే… ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమం బోధించడానికి వీల్లేదు అన్నట్లే ప్రతి పార్లమెంటు నియోజక వర్గంలో బోధనాసుపత్రి ఎందుకు అని కోర్టుకు వెళితే అక్కడ ఏం జరుగుతుందో తెలుసు.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దు… అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు వద్దు… పరిపాలనా వికేంద్రీకరణ వద్దు… ఈ 15నెలల్లో ఎన్ని అభ్యంతరాలో లెక్క పెట్టడం కూడా కష్టమే. ప్రజలు ఎన్నుకున్న శాసనవ్యవస్థ తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆటంకం ఎదురు కాకుండా లేదు. ఇది తమ ఘనత అని ప్రతిపక్షం ఛాతి విరుచుకోవచ్చు. న్యాయ వ్యవస్థకు-శాసన వ్యవస్థకు మధ‌్య సాగుతున్న సంవాదం, తీర్పులు అటుంచితే…, ఎన్నికల్లో మాత్రం తమకు నచ్చిన నాయకుడిని గెలిపించడానికి., తమకు ఏది మంచో., కాదో నిర్ణయించుకోవడంలో ఏ తీర్పులు పనిచేయవు.ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనపై ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు చూశాక., ఆంగ్లంలో విద్యావకాశాలు కొందరికి మాత్రమే ఎందుకు ఉండాలి అనే మౌలిక ప్రశ్న ఎందుకు విస్మరించారనే సందేహం వచ్చింది. పత్రికల్లో అమ్మభాష కమ్మదనం గురించి రాయడం వెనుక అంతరార్ధం తెలీనంత అజ్ఞానంలో జనం ఉన్నారనుకోవడమే విషాదం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించేంత సామర్ధ్యం ఉపాధ్యాయులకు ఉంటుందా అనే ధర్మ సందేహం కూడా ఉపాధ్యాయ సంఘాల నుంచి వస్తోంది. మాతృభాష నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో., ఎందుకు అంతగా ఆంగ్ల మాధ‌్యమాన్ని వ్యతిరేకిస్తున్నారో అర్ధం చేసుకోలేని స్థితిలో ప్రజలు మాత్రం లేరు. పేద., మధ్య తరగతి కుటుంబాల సంపాదనలో స్థాయిని బట్టి 10-20శాతం పిల్లల చదువులకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఆంగ్లంలో బోధించే పాఠశాలలు., కళాశాలలు కొన్ని కులాలకు పాడి ఆవులుగా ఎలా మారాయో తెలియంది కాదు. విజయవాడలో మొదలై ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలను 25ఏళ్ల పాటు చదువుల పేరుతో దోచుకున్న వర్గ ప్రయోజనాలకు ఒక్కసారిగా గండి పడుతుండటమే ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం. అదే సమయంలో 25ఏళ్లుగా ప్రభుత్వాలు విస్మరించిన పాఠశాల విద్య., ఇంటర్మీడియట్ విద్య ప్రైవేట్ రంగంలో పెరగడం., అందులో ఉపాధి అవకాశాలు కూడా కొన్ని సొంత సామాజిక వర్గాలకు పరిమితం కావడం మరో కారణం. ఆంగ్లంలో పట్టు లేకపోవడం వల్ల అవకాశాలు లేక., గ్రాడ్యుయేషన్., ఇంజినీరింగ్ పట్టాలున్నా., చదువుకు తగిన ఉపాధి రాని స్థితిలో దిగువ కులాల యువత మిగిలిపోతున్నారు. అమ్మభాష., మాతృభాష అంటూ ఉపన్యాసాలిచ్చే వారి పిల్లలు ఎవరు ప్రభుత్వ పాఠశాలల్లో చదవు., అంతెందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాల కోసం అహర్నిశలు కష్టపడిన ఉపాధ్యాయులు సైతం వారి పిల్లల్ని ఆంగ్ల మాధ్యమాల్లో చదివించడానికే ప్రాధాన్యతనివ్వడంపై ప్రజలు ఆలోచించుకోవాలి.విద్య తర్వాత సామాన్యులపై అత్యంత భారం మోపేది వైద్యమే. ఆస్పత్రికి వెళ్లాల్సి రావడమే సామాన్యులకు శాపంగా మారింది. వైద్యానికి కార్పొరేట్ రంగు పులిమి., జనం రక్తాన్ని పీల్చి పిప్పి చేసేలా ఆస్పత్రులు తయారయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం ఎంత భారమో ఒక్కసారి వాటి గడప దొక్కితే అర్థమవుతుంది. ప్రభుత్వాలు విద్యా., వైద్యం బాధ్యతల నుంచి తప్పుకోవడం వెనుక వాటి సామాజిక వర్గ ప్రయోజనాలు దాగున్నాయి. జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో కూడా కనీస సౌకర్యాలు లేకపోవడం., ప్రాణాలు దక్కించుకోడానికి ప్రైవేట్ వైద్యమే దిక్కవుతోంది. ఇప్పుడు పార్లమెంటు నియోజక వర్గానికో మెడికల్ కాలేజీ అంటే దాని ఫలితాలు కనీసం మూడు-నాలుగేళ్ల తర్వాతైనా అందుతాయి. కాలేజీల నిర్మాణాన్ని ఏ న్యాయస్థానాలు ప్రశ్నించకుండా, సకాలంలో అన్ని అనుమతులు వస్తే సమీప భవిష్యత్తులోనే వైద్య రంగానికి కూడా దశ మారుతుంది.విద్యా-వైద్యం కొన్ని కులాలకు ఆదాయ వనరుగా, తరతరాలకు ఆర్ధిక ప్రయోజనాలు అందించే చోదక శక్తిగా రాజకీయ పార్టీలు., పార్టీల యజమానులు భావించడంలో తప్పేమి లేదు. ఆ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం అర్థం లేని వాదనలకు విపరీతమైన ప్రచారం కల్పిస్తారు. కుల ప్రయోజనాలను సమిష్టి ప్రయోజనాలుగా ప్రచారం చేస్తుంటాయి. దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఇదే బాటలో ఉన్నాయి. ఆయా పార్టీలను నడిపించే ఇంధనం., కుల., వర్గ ప్రయోజనాలు ఇమిడి ఉండటంతో అందరికి లబ్ది చేకూర్చే వార్తలుగా వాటిని మలచి జనం మీదకు వదులుతుంటారు. నాణ్యమైన విద్య., ఆరోగ్యం ప్రజలకు అందుబాటులో ఉంటే వాటి నుంచి ఉపాధి అవకాశాలు సృష్టించడం కూడా కష్టమేమి కాదు. కాకపోతే మొదటి రెండు అందరికి అందడానికి సామాజిక వర్గ ప్రయోజనాలు ఒప్పుకోవు. ఒక వర్గం ప్రజలను ఎప్పటికీ నిచ్చెనలో కింది స్థానాల్లోనే ఉంచాలంటే వాటికి నాణ్యమైన విద్యా-వైద్యం అందకూడదనేదే అడ్డంకులు సృష్టిస్తున్న వారి ఆలోచన.