YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దుబ్బాక‌లో రాముల‌మ్మ పోటీనా

దుబ్బాక‌లో రాముల‌మ్మ పోటీనా

మెద‌క్, సెప్టెంబ‌ర్ 14, 
తెలంగాణలో మరో ఉప ఎన్నిక జరగబోతోంది. దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి త్వరలోనే ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి ఉప ఎన్నికల్లో తమదే విజయమని టీఆర్ఎస్ భావిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే శాసనసభ పక్ష సమావేశంలో లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని స్పష్టం చేశారు. రామలింగారెడ్డి కుటుంబంలో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని దాదాపు కేసీఆర్ డిసైడ్ అయ్యారు.అధికార పార్టీ దుబ్బాక ఉప ఎన్నిక పట్ల బిందాస్ గా ఉంది. తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నిక తామే గెలుచుకోవడంతో ఇదేమీ కష్టం కాదన్న కాన్ఫిడెన్స్ లో టీఆర్ఎస్ ఉంది. మరో వైపు బీజేపీ తరుపున రఘునందనరావు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఇంకా ఖరారు చేయనప్పటికీ తనకే గ్యారంటీ అన్న ధోరణితో ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు రఘునందనరావుకు అవకాశమిచ్చారని, మరోసారి ఎందుకని బీజేపీలోనూ అసమ్మతి స్వరాలు విన్పిస్తున్నాయి.ఇక కాంగ్రెస్ తాను దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఇటీవలే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా విజయశాంతి పేరు పరిశీలనలోకి వచ్చిందంటున్నారు. విజయశాంతి అంగీకరిస్తే దుబ్బాకలో పోటీకి దింపాలన్న యోచనలో ఉన్నారు. విజయశాంతి గతంలో మెదక్ జిల్లా నుంచే పోటీ చేయడంతో ఆమెకు ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది. మెదక్ ఎంపీగా కూడా విజయశాంతి ప్రాతినిధ్యం వహించారు.కాని ప్రస్తుతమున్న పరిస్థితుల్లో విజయశాంతి అంగీకరించే అవకాశం లేదంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శ్రావణ్ కుమార్ కూడా టిక్కెట్ ను ఆశిస్తున్నారు. అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పూర్తిగా కసరత్తులు చేయాలనుకుంటోంది. దుబ్బాక ఉప ఎన్నికలో గట్టి పోటీ ఇచ్చేందుకు బలమైన అభ్యర్థిని దింపాలన్న యోచనలో కాంగ్రెస్ ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా సర్వే చేయించాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మొత్తం మీద విజయశాంతి అంగీకరిస్తే దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

Related Posts