బీజేపీపై కాంగ్రెస్ పార్టీ మరో కొత్త అస్త్రం ప్రయోగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా రాహుల్‌గాంధీ పావులు కదుపుతున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన దూకుడు పెంచారు.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయడాన్ని నిషేధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడాన్ని నిరసిస్తూ దళితవర్గాలు ఏకంగా భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. నిజానికి ఈ స్థాయిలో నిరసన జరగడానికి చదువుకుంటున్న దళిత యువతే కారణం. దళితుల్లో విద్యావంతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే తమపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును దళితయువత సునిషితంగా పరిశీలిస్తోంది. అందుకే ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును, ఏక్కడైనా ఏదైనా ఘటన జరిగితే క్షణంలో దేశవ్యాప్త చర్చగా మారుతోంది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది.ఇక స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. అయితే ఇటీవల కాంగ్రెస్‌కు సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీల్లోనూ చీలికలు వస్తున్నాయి. ఇతర పార్టీల వైపు కూడా ఆ వర్గాలు చూస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతోన్న పరిణామాలు మళ్లీ ఆ వర్గాల ఓటర్లను ఆలోచింపచేస్తున్నాయి. దీనిని అనుకూలంగా మలుచుకునేందుకు రాహుల్ ఇప్పుడు ఈ అస్త్రాన్ని బీజేపీ మీద ప్రయోగించేందుకు రెడీ అవుతున్నారు.సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో అనూహ్య మార్పులు తీసుకొస్తున్నారు. కేంద్రంలో మోడీ-అమిత్‌షా ద్వయాన్నిఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు విమర్శలకు పదునుపెడుతున్నారు. చిన్నపాటి అవకాశం దొరికినా కేంద్ర ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. అటు పార్టీ సభలు, సమావేశాల్లో కేంద్రంపై విరుచుకుపడుతూనే, ఇటు సోషల్ మీడియాలోనూ ఆయన చురుగ్గా ఉంటూ యువతను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.దేశ జనాభాలో ఐదో వంతు ఉన్న దళితులు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. కొత్తతరం దళితుల సంఖ్య ఈ సారి గణనీయంగా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో వారే కీలక ఓటుబ్యాంకుగా మారుతున్నారు. 2.3 కోట్ల మంది యువ దళిత ఓటర్లు తొలిసారిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దేశం మొత్తమ్మీద ఉన్న దళిత జనాభాలో వీరే 19 శాతం ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ చాకచక్యంగా వ్యవహరిస్తోంది. ఇక్కడే రాహుల్‌గాంధీ తన మార్క్ రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కీలకంగా ఉన్న దళిత యువశక్తిని బీజేపీపై ప్రయోగించేందుకు వ్యూహరచన చేస్తున్నారు.ఈ క్రమంలోనే రాహుల్‌గాంధీ దళితులకు దగ్గరయ్యేందుకు ఓ కార్యక్రమం చేపడుతున్నారు. ముఖ్యంగా దళిత యువకులను మోడీ వ్యతిరేక శక్తిగా తయారుచేసే పనిలో పడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడండి.. అన్నపేరుతో దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ఈనెల 23న రాహుల్‌గాంధీ ప్రారంభించనున్నారు. దళితులు, రాజ్యాంగంపై దాడులకు వ్యతిరేకంగా దీన్ని చేపడుతున్నట్లు పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ నితిన్ రావత్ వెల్లడించారు. దళితవర్గానికి చెందిన చెందిన ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు ఆరంభ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. అయితే ఇప్పుడు.. రాహుల్‌గాంధీ ఈ కార్యక్రమం చేపట్టడం వెనక దూరదృష్టి ఉన్నట్లు సమాచారం.