విజయవాడ, సెప్టెంబర్ 14
ఏపీలో సంచలనంరేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ రమేష్ కోవిడ్ కేర్ సెంటర్ కేసులో సుప్రీంకోర్టులో జగన్ సర్కార్‌కు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.. కేసు దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. డాక్టర్ రమేష్‌ను నిర్బంధంలోకి తీసుకోకుండా విచారణ చేసుకోవచ్చని.. రమేష్ కూడా దర్యాప్తునకు సహకరించాలని కోర్టు సూచించింది.డాక్టర్ రమేష్ క్వాష్ పిటిషన్‌పై ఇటీవల హైకోర్టులో విచారణ జరిగింది. డాక్టర్ రమేష్‌తో పాటు హాస్పిటల్ ఛైర్మన్‌పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అసలు స్వర్ణ ప్యాలెస్‌ను క్వారంటైన్ సెంటర్‌గా అనుమతిచ్చిన కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్‌వోలకు ఎందుకు బాధ్యులను చేయలేదన్న ఈ సందర్భంగా ప్రశ్నించింది. కేసులో అధికారులను నిందితులకు చేరుస్తారా? అని ప్రశ్నించింది. ఇందులో అధికారుల తప్పు కూడా ఉందని.. ఘటనకు వారు కూడా బాధ్యులేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో జగన్ సర్కార్ హైకోర్టు ఉత్వర్వులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరగడంతో 10 మంది చనిపోగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.. ఈ కేసులో పలువుర్ని ప్రశ్నించారు. అప్పటి నుంచి రమేష్ బాబు కనిపించకుండా పోయారు.