విజయవాడ, సెప్టెంబర్ 15,
ఇది వైసీపీ ప్రభుత్వంలో వినిపిస్తున్న మాట. ఒక ప్రభుత్వం నడపడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మనకు ఒక సామెత ఉంది. వ్యవహారం గుట్టు, రోగం రట్టు అని. అంటే ఒక సగటు కుటుంబంలో అయినా చేసే వ్యవహారం పూర్తి అయ్యే వరకూ గుట్టుగానే ఉండాలి. తప్పులు ఉంటే సరిచూసుకునేలా ఉండాలి. కానీ జగన్ సర్కార్ అలా నడుస్తోందా అంటే కాదనే చెప్పాలి. జగన్ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు, కానీ ఆయన ఏదో వేదిక వద్ద పెదవి విప్పుతారు కదా. అలా అయన మాట నోట్లో ఉండగానే చంద్రబాబుకూ, ఆయన అనుకూల మీడియాకు చిటికలో చేరిపోతోందిట. దాంతో మాట జగన్ పెదవి దాటి వచ్చేలోగానే అడ్డుకట్ట వేసే మంత్రాంగాన్ని చంద్రబాబు సిధ్ధం చేసిపెడుతున్నారు.దాంతో మాట ఘనం, వ్యవహారం శూన్యం అన్నట్లుగా పదిహేను నెలల జగన్ పాలన తయారైంది అంటున్నారు. జగన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిని ఆయన తన మంత్రివర్గంలో చర్చిస్తారు. కానీ 25 మంత్రుల్లో ఒకరిద్దరు విభీషణులు ఉన్నారని అంటున్నారు. వారి ద్వారా అనుకూల మీడియా వివరాలు సేకరించి చేయాల్సిన యాగీ చేస్తోంది. దాంతో జగన్ మంత్రి పేర్ని నాని మీడియా బ్రీఫింగ్ ఇవ్వకుండానే టీడీపీ అనుకూల టీవీల్లో స్క్రోలింగ్ భారీగా వచ్చేస్తోంది. చిత్రమేంటంటే జగన్ కి సొంత మీడియా ఉంది. వారికి కనీసం ఉప్పు అందడంలేదు. ఇది నిజంగా ప్రభుత్వానికి తలవంపులే కాదు, షాక్ కూడా.జగన్ ఎవరి మాటా వినరు, ఆయన కనీసం ఇంట్లో తన వారితోనైనా ప్రజోపయోగమైన కీలక అంశాలు చర్చిస్తారో లేదో తెలియదు. ఆయన ఒక్కసారి మంత్రుల ముందు ఇదీ నా నిర్ణయం అని బయటపెట్టడం, అంతే దాన్ని ఓకే అని ఆమోదించడమే జరుగుతోంది. ఇది ముఖ్యమంత్రి వైపు నుంచి అతి పెద్ద మైనస్ గా ఉంటే, మంత్రులు సహకరిస్తున్నారా అంటే వారి దోవ వారిది. మంత్రి పదవి ఇచ్చారన్న ధన్యవాద భావంతో క్యాబినెట్ మీటింగులో ఓకే అని అంటున్న కొందరు తమ అక్కసు, అసంత్రుప్తిని టీడీపీ అనుకూల మీడియా ద్వారా తీర్చుకుంటున్నారని అంటున్నారు. మరికొందరు అంతకు పూర్వం తమకు ఆయా మీడియాతో ఉన్న అనుబంధం కారణంగా మొహమాటానికి పోయి మంత్రివర్గం వివరాలు మొత్తం చెప్పేస్తున్నారుట.జగన్ దీని మీదనే చాలా సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. అప్పట్లో ఒకసారి ఎన్టీయార్ హయాంలో బడ్జెట్ వివరాలు లీక్ అయ్యాయని మంత్రుల మీద చర్యలు తీసుకున్న ఉదంతం ఉంది. ఇక ప్రతీ మంత్రివర్గంలోనూ లీకు వీరులు ఒకరిద్దరు ఉంటారు. చంద్రబాబు మంత్రులలోనూ వైసీపీకి ఉప్పు అందించిన వారు ఉన్నారని చెబుతారు. అయితే అది ఒకసారో రెండు సార్లో కాదు, దాదాపుగా ప్రతీ మంత్రివర్గ సమావేశంలోనూ ఇలాగే జరగడంతో జగన్ అసహనంగా ఉన్నారని అంటున్నారు. దానికి తోడు జగన్ అనుకున్న పనీ ఒక్కటీ కావడంలేదు. కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ టైమ్ లో లీకులు వచ్చినా ఆయన అనుకున్నది చేసేవారు. లీకులు అందుకున్నా కూడా వైసీపీ చేసేదీ ఏమీ లేదు. నాడు అదీ తేడా. అందువల్ల జగన్ మంత్రుల మీద నిఘా పెడుతున్నారు అంటున్నారు. సరే మంత్రుల దాకా వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి కూడా తన విధానం సరి అయినదో కాదో చెక్ చేసుకోవాలి. ఆయన కూడా ఒంటెద్దు పోకడలు మానాలి. లేకపోతే వ్యవహారం చిరిగి చేట అవుతుంది. ఇప్పటికే వెనక్కీ, ముందుకూ ప్రతీ నిర్ణయం లాక్కుంటూ జగన్ సర్కార్ అనుభవరాహిత్యంతో చాలానే పరువు పోగొట్టుకుంది అంటున్న వారూ ఉన్నారు.