గుంటూరు, సెప్టెంబర్ 15,
ప్రత్యర్థి పార్టీపై ఏ పార్టీ అయినా పైచేయి సాధించాలని చూస్తుంది. ఇక, అధికారంలో ఉన్న పార్టీపై ప్రతిపక్ష పార్టీలు దూకుడు ఎప్పుడూ చూపిస్తాయి. ఈ విషయంలో చంద్రబాబు కూడా అంతే దూకుడు చూపిస్తున్నారు. అధికార పార్టీ వైసీపీపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు నిలుపుదల, అమరావతి రాజధాని వంటి అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పోరాటాలు చేస్తున్నారు. చంద్రబాబు జీవితంలో ఎన్నడూ చేయని జోలె పట్టడం కూడా అమరావతి ఉద్యమంలో మనం చూశాం. ఇప్పుడు తాజాగా రైతుల విద్యుత్ వినియోగానికి జగన్ సర్కారు మీటర్లు పెడుతున్న విషయంపైనా చంద్రబాబు ఫైర్ అవుతున్నారు. తన అనుకూల మీడియాలో జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో కథనాలు కూడా రాయిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.అయితే, అన్ని విషయాల్లోనూ చంద్రబాబు ఇదే తరహా దూకుడు చూపిస్తున్నారా ? జగన్ ప్రభుత్వాన్ని ఆయన అన్ని విధాలా టార్గెట్ చేస్తున్నారా ? అంటే.. లేదనే చెప్పాలి. కొన్ని విషయాల్లో తీవ్రస్థాయిలో ఫైరవుతున్న చంద్రబాబు.. మరికొన్ని విషయాలను మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, తన పార్టీ నేతలను కూడా కొన్ని విషయాల జోలికి పోవద్దని, అతిగా విమర్శించవద్దని కూడా సూచిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో రెండు అంశాలు కీలకంగా ఉన్నాయి. ఒకటి జిల్లాల ఏర్పాటు, రెండు తెలుగు మీడియం ఎత్తివేత. ఆ విషయాల్లోనూ నిజానికి ఆదిలో చంద్రబాబు దూకుడు ప్రదర్శించాలని అనుకున్నారు. తెలుగు మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎత్తేసే విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుందామని అనుకున్నారు.అసలు తెలుగు మీడియాన్ని తీసేసే ఆలోచనపై తెలుగు పండితులు సహా చంద్రబాబు అనుకూల మీడియా నుంచి కూడా వ్యతిరేకత రావడంతో జగన్ వెనక్కి తగ్గారు. ఇక, ఆ తర్వాత దీనిపై కేసులు నమోదయ్యాయి. కోర్టుల వరకు వెళ్లాయి. హైకోర్టు ఈ విషయంలో జగన్ సర్కారు దూకుడుకు కళ్లెం వేసిందనే చెప్పాలి. ఇక, ఇటీవల సుప్రీం కోర్టు కూడా దాదాపు హైకోర్టును సమర్ధించే విధంగానే వ్యాఖ్యానించింది. ఈ పరిణామాలతో చంద్రబాబు మళ్లీ విజృంభిస్తారని తమ్ముళ్లు భావించారు. కానీ, అనూహ్యంగా ఆయన సైలెంట్ అయ్యారు. అంతేకాదు, తెలుగు మీడియం విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరూ మాట్లాడొద్దని బాబు హెచ్చరించారు.ఇది రాజకీయంగా ఓటు బ్యాంకుతో ముడిపడిన నేపథ్యంలో చంద్రబాబు ఈ విషయంలో జాగ్రత్త పడ్డారని తమ్ముళ్లు అంటున్నారు. క్షేత్రస్థాయిలో పేదలు తమ పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు ఉండాలని కోరుకుంటున్నారు. ఈ సమయంలో దీనిని రాజకీయంగా రగడ చేస్తే.. టీడీపీనే అడ్డు పడుతోందని జగన్ ప్రభుత్వం ప్రచారం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఓటు బ్యాంకును తీవ్రంగా కుదిపేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఈ విషయంలో జాగ్రత్త పడ్డారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక కొత్త జిల్లాల విషయంలోనూ రకరకాల చర్చలు వైసీపీ నేతల్లోనే స్టార్ట్ అయ్యాయి. దీనిపై మాట్లాడితే స్థానికంగా ప్రజల మనోభావాలు దెబ్బతింటాయన్న ఆందోళనలో చంద్రబాబు ఉన్నారట. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఏం మాట్లాడినా తేనెతుట్టెను కదిపినట్టే అవుతుంది. ఈ విషయంలో కూడా ఆయన ఓటుబ్యాంకును దృష్టిలో పెట్టుకునే మౌనం వహిస్తున్నారని తెలుస్తోంది.