విజయవాడ, సెప్టెంబర్ 15,
లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు విజయవాడ దుర్గమ్మ గర్భగుడిలో క్షుద్రపూజలు చేయించారంటూ టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పెద్ద వివాదమే సాగింది. అయితే దీనిపై నాటి చంద్రబాబు సర్కార్ ఏమి లేదంటూ తేల్చేసింది. అప్పటి ఆలయ అధికారి సూర్య కుమారి ని బదిలీ చేసి చేతులు దులుపుకుంది. కొందరిపై తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి తమదైన స్టయిల్ లోనే వివాదానికి చెక్ పెట్టేసింది. దీనిపై తాము అధికారంలోకి వచ్చాకా కేసు బయటకు తీసి సంగతి తెలుస్తామంటూ వైసిపి ఎన్నికల ప్రచారం లో కూడా ఈ అంశాన్ని బాగానే వాడుకుంది. అయితే ఆ వివాదాన్ని జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక పక్కన పడేసింది. అంతర్వేది లో రథం దగ్ధం సంఘటన లో వైసిపి సర్కార్ బాగా అల్లరిపాలైంది. జగన్ సిబిఐ కి కేసును అప్పగిస్తున్నట్లు ప్రకటించి వ్యూహాత్మకంగా విపక్షాలపై అస్త్రం ప్రయోగించారు. దాంతో బిజెపి, జనసేన లు కొంత వెనక్కి తగ్గాయి. అయితే టిడిపి మాత్రం బిజెపి కన్నా ఎక్కువ హడావిడి దీనిపై మొదలు పెట్టింది. దీన్నో ఉద్యమంగా మలిచే ప్రయత్నం చేస్తుంది. ఇది గమనించిన వైసిపి సర్కార్ సున్నితమైన పాత వివాదాలను తెరపైకి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం మొదలు పెట్టినట్లే కనిపిస్తుంది.ఇందులో భాగంగా దుర్గగుడి లో టిడిపి సర్కార్ హయాంలో జరిగిన క్షుద్రపూజల వ్యవహారం రచ్చ చేసి దర్యాప్తు తిరిగి రీ స్టార్ట్ చేయించి ప్రధాన విపక్షం నోరు మూయించాలన్న ఎత్తుగడ వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే విచారణకు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి. పాత చింతకాయ పచ్చడి అయిన వదిలేసిన ఈ కేసు ఇప్పుడు అధికారపార్టీకి పనికిరావడం నెట్టింట చర్చనీయంగా మారింది.