గుంటూరు, సెప్టెంబర్ 15,
అన్న నందమూరి తారకరాముడికి పోయిన వారు పోగా పదకొండు మంది సంతానంగా ఉండేవారు. వారి పిల్లలు అంటే మనవలు దాదాపుగా మూడు డజన్ల దాకా ఉంటారని ఒక అంచనా. కొడుకుల్లో బాలక్రిష్ణ, హరిక్రిష్ణ, కూతుళ్ళలో భువనేశ్వరి, పురంధేశ్వరి పేర్లు వినిపించాయి. అల్లుళ్ళలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు మాత్రమే కనిపిస్తారు. మనవళ్ళ విషయానికి వస్తే హరిక్రిష్ణ కొడుకు జూనియర్ ఎన్టీయార్ పేరు మాత్రమే సినీ రంగాన కానీ రాజకీయ వార్తలుగా కానీ ఎపుడూ మారుమోగుతుంది. ఇక కూతురు భువనేశ్వరి కొడుకుగా నారా లోకేష్ అన్న గారికి రెండవ వైపు నుంచి మనవడు. మన సంప్రదాయాల్లో చూసినా, చట్టప్రకారం చూసిన ఇంటిపేరు మోసేవారే అసలైన వారసులు, ఆ విధంగా చూస్తే జూనియర్ ఎన్టీయార్ అన్నగారికి నిజమైన వారసుడు అని చెప్పాలి.అయితే జూనియర్ ఎన్టీయార్ ప్రతిభా పాటవాలు గమనించి ఆదిలోనే చంద్రబాబు రాజకీయాలకు ఆయన్ని దూరం పెట్టారని అంటారు. 2009 ఎన్నికల వేళ తెలిసో తెలియకో చంద్రబాబు ఆయన ప్రచార సేవలను వాడుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీని జూనియర్ గెలిపించకపోయినా ఆయన జనంలో మాత్రం ఎన్టీయార్ కి అసలైన వారసుడు అని గట్టి ముద్రను వేసుకున్నారు. అచ్చం పెద్దాయనలాగానే ఉన్నాడే అని సగటు తెలుగు జనం అనుకున్నారు. దాంతో ఇవాళ కాకపోయినా రేపు అయినా టీడీపీకి భావి సారధి అవుతాడు అని బాబు భయపడ్డారంటారు.2009 ఎన్నికల తరువాత జరిగిన ఒక మహానాడులో జూనియర్ ఎన్టీయార్ కనిపించాడు. అది పార్టీ ప్రతినిధుల సభ. ఆ సభలో అధ్యక్షుడు బాబు ప్రసంగం కంటే కూడా జూనియర్ ఉపన్యాసానికి రెట్టింపు స్పందన వచ్చింది. అలా పార్టీ ఏకగ్రీవంగా జూనియర్ ని ఫ్యూచర్ స్టార్ ఆఫ్ టీడీపీ అని డిక్లేర్ చేసింది. నాటికి లోకేష్ రాజకీయ తెర ముందుకు కూడా రాలేదు. ఇక హరిక్రిష్ణ టీడీపీలో తాను కోల్పోయిన దాన్ని కొడుకు ద్వారా భర్తీ చేసుకుందామని ఆశ పడిన మాట కూడా ఉంది. తన కుమారుడికి తెలుగు యువత ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని హరి అడిగారు అంటారు, కానీ చంద్రబాబు ఇవ్వకుండా ఏకంగా టీడీపీకే జూనియర్ ని దూరం చేశారని కూడా చెబుతారు.తెలుగుదేశం పార్టీకి 2014 ఎన్నికలు చావో రేవోలాంటివే. కానీ ఆ ఎన్నికల కోసం పొరపాటున కూడా బాబు జూనియర్ ని ప్రచారం కోసం సాయం అడగలేదు. తమ ఫ్యామిలీకి సంబంధం లేని మరో సినీ స్టార్ పవన్ ని తెచ్చుకుని పనికానిచ్చేశారు. ఆ తరువాత లోకేష్ ని మంత్రిగా చేసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి భావి వారసుడి సమస్య పూర్తిగా తేల్చేశాననుకున్నారు. కానీ బొమ్మ తిరబడి 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్ల దగ్గర పతనం అయింది. ఇక నాటి నుంచి తండ్రీ కొడుకులు పడుతున్న అవమానాలు అన్నీ ఇన్నీ కావు. టీడీపీ బతకాలంటే జూనియర్ ఎన్టీయార్ రావాల్సిందేనని బయట నుంచి కొడాలి నాని వంటి వారు కెలుకుతూంటే అదే తన అభిప్రాయం అని టీడీపీ తమ్ముళ్ళు లోలోపల చెప్పకనే చెప్పేస్తున్నారు.జూనియర్ ఎన్టీయార్ కొత్త పార్టీ పెడతారు అంటూ కొడాలి నాని బాంబు పేల్చారు నిజానికి ఇపుడున్న స్థితిలో జూనియర్ సినిమాలు వదిలిరారు అన్నది అందరికీ తెలిసిందే. కానీ 2024లో గానే టీడీపీ పగ్గాలు జూనియర్ చేతికి చిక్కేలా నాని ఇలా మైండ్ గేమ్ మొదలెట్టారన్న మాట. లోకేష్ ని ఎంత ముందుకు తేవాలని బాబు అనుకుంటే అంతగా జూనియర్ సౌండ్ టీడీపీలో వినిపించేలా నాని లాంటి వారు వేస్తున్న ఎత్తు అన్న మాట. ఇక టీడీపీలో కూడా ఇది ఏదో ఒక రోజు బడబాగ్నిలా బద్దలవుతుంది. అది 2024 కంటే ముందు జరుగుతుందా లేదా అన్నదే చూడాలి. జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి రావడం మానడం పక్కన పెడితే ఆయన మాట వింటేనే ఇద్దరు బాబులూ ఉలిక్కిపడే సీన్ ఇపుడు పసుపు పార్టీలో ఉంది. మొతానికి సీనియర్ ఎన్టీయార్ ఇద్దరు మనవళ్ళలో అసలైన మొనగాడు ఎవరో దీంతో తెలిసిపోవడంలేదూ.