విజయనగరం, సెప్టెంబర్ 15,
దశాబ్దాల కాలంగా రైతులను వెంటాడు తున్న భూ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడగులేస్తోంది. భూముల సమగ్ర సర్వేకు సన్నద్ధమవుతోంది. 2021 జనవరి నెల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించేందు కు ఏర్పాట్లు చేస్తోంది. రైతుల భూములకు చెందిన రికార్డుల సమస్యలను గుర్తించిన సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి భూ సమగ్రసర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 12లక్షల60వేల377ఎకరాల 20 సెంట్ల భూమిని అధికారులు సర్వే చేయనున్నారు. దీనివల్ల భూముల వివరాలు పక్కాగా నమోదవుతాయని, ఎలాంటి వివాదాలకు తావుండదని, వివాదాల్లో ఉన్న భూములకు పరిష్కారం దొరుకుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. గతంలో పట్టాదారు పాస్ పుస్తకం ఒకరిపేరు మీద ఉంటే రెవెన్యూ రికార్డుల్లో ఇంకొకరి పేరుతో ఆ భూమి ఉండేది. ఫలితంగా సంక్షేమపథకాలు సంబంధిత రైతులకు అందడంలేదు. మరోవైపు తల్లిదండ్రులు మృతిచెందితే... వారిపేరు మీద ఉన్న భూములు వారసుల పేరుకు మార్చేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటికీ సమగ్ర సర్వే ఒక్కటే మార్గమని సీఎం భావిస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం– కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరింగ్ స్టేషన్ నెట్‌వర్క్ సాయంతో సమగ్ర భూసర్వేకు సన్నద్ధమవుతున్నారు. గ్రామాల్లో రైతులకు ఉన్న భూములను గుర్తించి ఆధార్ కార్డుల ఆధారంగా వారి వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేస్తారు. చిన్నచిన్న కమతాల నుంచి భూస్వాముల వరకూ ప్రతీది నమోదు చేస్తారు. జనవరి నుంచి ఈ పునఃసర్వే జరగనుంది. తొలుత మెట్ట ప్రాంతాలను తీసుకోగా, అనంతరం పల్లపు భూములను కొలతలు వేసి ప్యూరిఫికేషన్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు సర్వేయర్లతో పాటు ఇతర అధికారులకు శిక్షణ ఇస్తోంది. ముందుగా తహసీల్దార్ కార్యాలయాల్లోని రికార్డులను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి రికార్డులు గ్రామస్థాయిలోకి వెళ్తా యి. రైతులకు ఉన్న వాస్తవ భూమిని పరిశీలించి సరి చేస్తారు. చిన్నచిన్న సమస్యలు ఉన్నచోట వెంటనే పరిష్కరిస్తారు. పెద్ద, పెద్ద సమస్యలను తహసీల్దార్ సమక్షంలో పరిష్కరిస్తారు. క్షేత్రస్థాయి నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. కోర్టులో కేసులు ఉన్నవాటి వివరాలను ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచుతారు. మిగిలిన భూము ల వివరాలు మొత్తం ఆన్‌లైన్ కానున్నాయి. వీటితో పాటు ఇంటిపట్టాల వివరాలు, పొజిషిన్ సర్టిఫికెట్లు, ప్రభుత్వం ఇవ్వనున్న ఇళ్ల స్థలాలు పట్టాలు కూడా ఆన్‌లైన్ కానున్నాయి.