ప్రపంచాన్నే శాంతింపచేయగల వేదమే ‘శివం’. శివం అన్న శబ్దానికి భద్రం, కల్యాణం, శుభం అనే అర్థాలున్నాయి. శివమే శివుడు. అరిష్టాలను నాశనం చేసి శుభాలను ఇస్తాడు. దివ్యమంగళస్వరూపం ఆయనది. శివుడే రుద్రుడు. రుద్ర శబ్దం కోపాన్ని తెలియచేసే గుణవాచకం. చెడును, దుష్టత్వాన్ని అంతంచేసే ఆయుధమే రౌద్రం. అది క్షేమాన్ని, శ్రేయస్సును కాంక్షిస్తుంది. దక్షప్రజాపతి అహంకారంతో శివుణ్ని అవమానించాడు. నిరీశ్వరయాగాన్ని సంకల్పించాడు. పుట్టింటికొచ్చిన సతీదేవికి పుట్టెడు అవమానం ఎదురైంది. యోగాగ్నిలో భస్మమైంది. ప్రళయకాల రుద్రుడైనాడు శివుడు. దక్షయజ్ఞం ధ్వంసమైంది. భగవానుడినే అవమానించే అహంకారం, సర్వనాశనానికి హేతువవుతుందని, స్త్రీమూర్తికి పుట్టినింట నిరాదరణ ఉండరాదన్న వేదహితమైన సత్యాలను తెలిపింది శివుడి రౌద్రం. కోపానికి, క్రోధానికి తారస్థాయి రూపమే రౌద్రం. రుద్రసూక్త నమకం ప్రథమ అనువాకంలో ‘నమస్తే, రుద్రమన్యవ, ఉతోత ఇషవేనమః’ అనే ప్రస్తావనకు- ‘ఓ రుద్రదేవా! నీ క్రోధానికి, చేత ధరించిన బాణానికి నమస్కరిస్తున్నాను’ అని అర్థం. తనను చెరబట్టిన రావణుడు అలవిమాలిన గొప్పలు చెప్పుకొంటున్నప్పుడు- ‘శ్రీరాముడు కన్నెర్ర చేస్తే చాలు, సముద్రాలు ఇంకిపోతాయి. ప్రచండ భానుడు తన ప్రకాశాన్ని కోల్పోతాడు. నీ పది తలలు నేలరాలతాయి’ అంటుంది సీతమ్మ. రావణుడి దుష్టతలంపునకు, అహంకారానికి- శ్రీరాముడి కోపజ్వాల గుణపాఠంగా చెప్పితీరుతుందన్న సీతమ్మ హెచ్చరిక అది.
‘శాంతమూర్తి ధర్మరాజు. ఆయనకే కోపంవస్తే సముద్రాలన్నీ ఏకమవుతాయి. ప్రళయం సంభవిస్తుంది. అంగరాజైన కర్ణుణ్ని చూసుకొని భ్రమపడుతున్నావేమో! ఇటువంటివారు పదివేలమందైనా యుద్ధరంగంలో కూలడం తథ్య’మని పాండవ కౌరవ సంధికై రాయబారిగా వెళ్ళిన శ్రీకృష్ణభగవానుడు రారాజును హెచ్చరిస్తాడు. ధర్మమే నాడిగా ఉన్నవారికి కోపంవస్తే అదివిలయాన్నిసృష్టిస్తుందనివిశదం చేస్తాడు.
కోపం అర్థవంతమైందిగా, అన్యాయాన్ని ప్రతిఘటించేదిగా ఉండాలి. రాళ్ళతో కొట్టి చంపుతున్నా పాము బుసకొట్టకుండా ఉంటే, అది సహజత్వం కాదు. సమర్థనీయమూ కాదు. ఆత్మరక్షణకు, ప్రాణరక్షణకు బుసకొట్టడం ఆవశ్యకం. ఉత్తముడికి వచ్చే కోపం బుద్ధిచెప్పేదిగా ఉంటుంది. కక్ష సాధించేదిగా ఉండదు.
అయినదానికి, కానిదానికి కోపాన్ని ఓ ఆయుధంగా వాడుకుంటే అది బుద్ధిహీనత్వమే అవుతుంది. అందరూ తనను దూరంపెట్టే స్థితి ఏర్పడుతుంది. ఫలితంగా ఒంటరివారైపోయే ప్రమాదం వాటిల్లుతుంది. భగవద్గీత వ్యక్తిత్వ వికాసానికి, ఔన్నత్యానికి దోహదపడే పవిత్ర గ్రంథం. శ్రీకృష్ణ భగవానుడు సాంఖ్యయోగంలో- క్రోధంవల్ల స్మృతి ఛిన్నాభిన్నమై, బుద్ధి నశించి మనిషి పతనస్థాయికి చేరతాడని తెలియజెప్పాడు. నేటి మానవచిత్త ప్రవృత్తులు ఎవరి చెప్పుచేతల్లో ఉండేవి కావు. కోరికలకు మూలం విషయాసక్తి. అవి తీరనప్పుడు క్రోధం ఏర్పడటం మానవ నైజంగా ఉంటుంది.
అర్థరహితమైన అహంకారంతో, ఆభిజాత్యంతో వచ్చిపడే, క్రోధావేశాలతో జీవితంలో అలజడి, అశాంతి తప్పవు. శాంతి, సామరస్య ధోరణులు మృగ్యమవుతాయి. విచక్షణాజ్ఞానం శూన్యమవుతుంది. మనుషులమధ్య అగాధమేర్పడుతుంది. మానవ బంధాల మాధుర్యం మంటకలుస్తుంది. అనవసరంగా వచ్చిపడే క్రోధావేశాలు అనర్థదాయకమని నీతిశతకాలు ఉద్భోధిస్తున్నాయి. సమాజంలోని కుటుంబ శాంతిసౌఖ్యాలకై మంచిలక్షణాలను, వ్యక్తిశీలసంపదలను వృద్ధిచేసుకొమ్మని తెలుపుతాయి.
సుమతీ శతకకారుడు బద్దెన తన కోపమె తన శత్రువంటూ సందేశమిచ్చాడు. ప్రజాకవి వేమన, క్రోధంవల్ల గొప్పదనం తగ్గిపోతుందని, పైగా అది దుఃఖహేతువని హితవు చెప్పాడు. రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించకూడదు అంటోంది వేదం. రుద్రుని ఆవాహన చేసుకొని అర్చించాలి. ఆవాహన చేసుకోవడమంటే లోకరక్షణ, శాంతిసౌభాగ్యాల కోసమే తన శక్తిని, వడిని వినియోగించాలి. జ్వలించే స్థితిగతులను చల్లబరచే ఆవేశం, ఆలోచన ఉండాలి. అటువంటిసాధనాపరులు శివస్వరూపులే!
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో