కాళీమాత పాదాల కింద శివుడు ఎందుకు ఉంటాడో పురాణ గాథలో ఆసక్తికర కథ ఉంది.
రాక్షస గణాలను అందరినీ చంపగా చివరికి రక్తబీజు అనే రాక్షసుడు మిగులుతాడు.
బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్తబీజుని ఒంటి నుంచి ఒక్క రక్తం చుక్క భూమిపై పడితే అప్పుడే వందలాది మంది సైనికులు పుట్టుకొస్తారు.
దీంతో దుర్గ అతనితో తలపడి గాయపరిచిన కొద్దీ అతని సైన్యం సంఖ్య పెరుగుతూ పోయింది.
దుర్గాదేవి అయోమయస్థితిలో పడుతుంది.
సైనికులు మూకుమ్మడిగా దుర్గపై దాడి చేస్తూ ఉంటారు. ఆమెకు కలిగిన కోపంతో భయంకర రూపంలోని కాళి ఆవిర్భవించింది.
కాళి సైనికులను సంహరించి , చివరకు రక్తబీజు పై దాడి చేస్తుంది.
రక్తబీజుని ఒడిసి పట్టుకొని అతని ఒంటిలోని రక్తాన్ని పూర్తిగా తాగేస్తుంది.
అనంతరం రక్తబీజుడి తలని చేతిలో పట్టుకొని రక్తం కింద పడకుండా కింద ఓ చిప్ప పట్టుకుంటుంది.
దీంతో రక్తబీజుడు మరణిస్తాడు.
అయితే రక్తబీజు రక్తం తాగిన కాళిపై దుష్ప్రభావం చూపసాగుతుంది.
దీంతో కాళి కరాళనృత్యం చేయడం ప్రారంభిస్తుంది. భూమిపై వేస్తున్న ఒక్కొక్క అడుగుతో కాళి వినాశనం మొదలవుతుంది.
దేవతలు రక్షణకై జోక్యం చేసుకోవాలని శివుడిని ప్రార్ధిస్తారు.
శివుడు యుద్ధభూమికి వచ్చి కాళిని శాంతిపచేయడానికి ఆమెను పలుమార్లు పిలుస్తాడు.
అయితే ఆమె వినిపించుకొనే స్థితిలో ఉండదు.
రాక్షసుల మాంసాన్ని తింటు నృత్యం కొనసాగిస్తుంటుంది. ఆమె కొప్పుముడి తొలిగి కేశరాశిగా మారుతుంది.
విప్పుకొన్న ఆమె కేశపాశం కదలికతో వెలువడే గాలి కొందరు దేవతలను దూరానికి విసిరేస్తుంది.
శివుడు అన్ని విధాలా ప్రయత్నించి చివరకు గత్యంతరం లేక శాంతించమని కోరుతూ కాళి పాదాల కింద చేరతాడు. తన పాదాల కింద ఉన్న వ్యక్తి తన భర్త అని కాళి తెలుసుకొని కొంత సేపటి తర్వాత శాంతిస్తుంది.
ఆ కోపాగ్ని నుంచి బయటపడి శాంతం వహించి మామూలు దుర్గగా మారుతుంది.
ఇలా శివుడు కాళి కింద ఉండడానికి కారణం ఇది అని పురాణాల్లో ఉంది.
శివానందా రూపం శివోహం శివోహం
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో