YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

క‌రోనా త‌ర్వాత జాగ్ర‌త్త‌లు

క‌రోనా త‌ర్వాత జాగ్ర‌త్త‌లు

హైద్రాబాద్‌‌, సెప్టెంబ‌ర్ 15, 
కరోనా నుంచి కోలుకున్న వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పోస్ట్‌ కోవిడ్‌ ఫాలోఅప్‌పై  మార్గదర్శకాలు జారీచేసింది. కోలుకున్న వారిలో కొంత మందిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపింది. కొందరు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఎక్కువ కాలం పడుతుంది. తీవ్రమైన కరోనా తరువాత కోలుకున్న కొందరిలో అలసట, ఒళ్లు నొప్పులు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైన లక్షణాలు ఉంటున్నాయి. ఇవి కేవలం ఫాలోఅప్‌ ప్రొటోకాల్స్‌ మాత్రమేనని, చికిత్స లేదా నివారణ కాదని స్పష్టం చేసింది. మాస్క్‌ని తప్పనిసరిగా వాడాలి. చేతులను తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. భౌతిక దూరం పాటించాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో గోరు వెచ్చని నీరు తాగుతూ ఉండాలి.రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఆయుష్‌ మెడిసిన్‌ని వాడాలి. ఆరోగ్యం బావుంటేనే ఇంట్లో పనులు చేసుకోవాలి. దశల వారీగా ఆఫీసు పనుల్లో చేరాలి. వైద్యులు సూచించిన విధంగా ప్రతీ రోజూ యోగా, ప్రాణాయామ, మెడిటేషన్‌ చేయాలి.వైద్యుడు చెబితేనే బ్రీతింగ్‌ వ్యాయామం చేయాలి.ప్రతీరోజూ ఉదయం లేదా సాయంత్రం వీలైనమేర నడవాలి.సరిపోయినంత పోషకాహారం తీసుకోవాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. తగినంత నిద్ర, విశ్రాంతి తప్పనిసరి.
అధిక జ్వరం, శ్వాససంబంధ సమస్యలు, గుండెల్లో నొప్పి వంటి లక్షణాలు ఉంటే ముందుగానే అప్రమత్తం అవ్వాలికోలుకున్న వారం తరువాత తమ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడటం మంచిది.
హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు ఏదైనా ఇబ్బందికర లక్షణాలు కనిపిస్తే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లడం మంచిది.ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారికి క్రిటికల్‌ సపోర్ట్‌ అవసరం. ధూమపానం, మద్యపానం మానుకోండి. ఇతరత్రా అనారోగ్యాలకు ఇప్పటికే మందులు వాడేట్లయితే వాటిని యథావిధిగా తీసుకోవాలి. ఇంట్లో స్వీయ ఆరోగ్య పర్యవేక్షణ తప్పనిసరి. అందుకోసం శరీర ఉష్ణోగ్రత చూసుకునేలా థర్మామీటర్‌ ఉండాలి. రక్తపోటు, డయాబెటీస్‌ పరీక్షించుకోవాలి. పల్స్‌ ఆక్సిమీటర్‌ చూసుకోవాలి. నిరంతరం పొడి దగ్గు లేదా గొంతు నొప్పి ఉంటే ఆవిరిపట్టాలి. గార్లింగ్‌ చేయాలి. ఆవిరి పట్టే నీటిలో అవసరమైన సుగంధ ద్రవ్యాలు వేసుకోవాలి.
వైద్యుడి సలహా మేరకు దగ్గు మందులు వాడాలి. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం, ఆక్సిజన్‌ స్థాయులు 95 శాతం కంటే తక్కువైతే, ఛాతి నొప్పి, బలహీనంగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
అవగాహన లేకుండా అనవసరంగా మందులు వాడకూడదు. దీంతో తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ ప్రమాదం పొంచి ఉంది. డాక్టర్ల సూచన మేరకు రోగనిరోధక శక్తిని పెంచే కింది ఆయుష్‌ మందులను వాడొచ్చు.
ఆయుష్‌ క్వాత్‌ (150 మి.లీ; 1 కప్పు) ప్రతీ రోజూ సంషమణి వతి రోజుకు రెండుసార్లు 500 మి.గ్రా. (రోజుకు 1 గ్రాము) లేదా గిలోయ్‌ పౌడర్‌ 1 –3 గ్రాముల గోరు వెచ్చని నీటితో 15 రోజులు
అశ్వగంధ 500 మి.గ్రా. రోజుకు రెండుసార్లు (రోజుకు 1 గ్రాము) లేదా అశ్వగంధ పౌడర్‌ 1–3 గ్రాములు రోజుకు రెండుసార్లు 15 రోజులు. ఆమ్లా ప్రతిరోజూ/ఆమ్లా పౌడర్‌ 1–3 గ్రాములు ప్రతిరోజూ
ములేతి పౌడర్‌ (పొడి దగ్గు ఉంటే) 1– 3 గ్రాములు గోరు వెచ్చని నీటితో రోజుకు రెండుసార్లు అర టీస్పూన్‌ పసుపు వేసిన వెచ్చని పాలు (ఉదయం లేదా సాయంత్రం) తాగాలి.
పసుపు, ఉప్పుతో గార్లింగ్‌ చేయాలి. చ్యవన్‌ప్రాశ్‌ను ఉదయం (1 టీస్పూన్‌లో పూర్తిగా) గోరు వెచ్చని నీరు లేదా పాలతో వాడొచ్చని ఆయుష్‌ మంత్రిత్వశాఖ సిఫార్సు చేసింది. అంతేకాదు క్లినికల్‌ ప్రాక్టీస్‌లో చ్యవన్‌ప్రాశ్‌ రికవరీ అనంతర కాలంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని నమ్ముతున్నారు.

Related Posts