న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15,
ఆయన చాలా తెలివిగానే తానున్న పార్టీని దెబ్బ తీస్తున్నాడు. ఆయనే వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజు. ఆయన మన పార్టీ అంటూనే కత్తి తీస్తున్నాడు. జగన్ కి సలహా ఇస్తున్నట్లే కనిపిస్తూ రచ్చ చేయాల్సిందిచేస్తున్నాడు. ఆయన ప్రతీ రోజూ ఢిల్లీ నుంచి ఠంచనుగా మీడియా ముందుకు వస్తాడు. జగన్ సర్కార్ మీద టీడీపీ కంటే దారుణంగా కామెంట్స్ చేస్తాడు. చిత్రమేంటంటే జగన్ సర్కార్ని చీల్చి చెండాడుతూనే ఆ విషయాలు ఏవీ జగన్ కి తెలియదనుకుంటాను, ఆయనతో సంబంధం లేకుండా పార్టీలోని కొంతమంది చేస్తున్న పనులు ముఖ్యమంత్రికి చెడ్డ పేరు తెస్తునన్నాయంటూ జగన్ మీద అక్కడికి ఏదో సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లుగా రఘు రామకృష్ణం రాజు చెప్పుకుంటున్నారు.రఘు రామకృష్ణం రాజు మాటలు వింటూంటే జగన్ కళ్లకు గంతలు కట్టుకున్నట్లుగా భావించాలేమో. ఏపీలో ఏ విషయం తీసుకున్నా జగన్ కి తెలియదు, ఆయనను అలా పక్కన పెట్టి భజన నాయకులు అలా చేసేస్తున్నారు అని రఘు రామకృష్ణం రాజు అంటున్నారు. దీని వల్ల జగన్ ని తాను డైరెక్ట్ గా ఏమీ అనలేదు అన్న తెలివిని చూపిస్తున్నారు. అదే సమయంలో పేరుకు మాత్రమే జగన్ సీఎంగా ఉన్నారు తప్ప ఆయనతో పని లేకుండానే ఏపీలో ఇంత పెద్ద ఎత్తున పాలన జరిగిపోతోందని రఘు రామకృష్ణం రాజు చెప్పడం అన్న మాట. ఇక దళితుల శిరోముండనం ఘటన అయినా, హిందూ దేవాలయాల విషయం అయినా జగన్ ని వెనకేసుకు వస్తున్నట్లుగా రఘు రామకృష్ణం రాజు చేస్తున్న కామెంట్స్ తిప్పి తిప్పి జగన్ కే చుట్టుకునేలా చేస్తున్నాయి.బయటకు ఆ మాట అనడంలేదు కానీ జగన్ని ఓ విధంగా అసమర్ధుడిగానే రఘు రామకృష్ణం రాజు చెబుతున్నట్లుగా ఉంది. చంద్రబాబు అయితే తన జీవితంలో జగన్ లాంటి అసమర్ధుడిని సీఎంగా చూడలేదని డైరెక్ట్ గానే విమర్శలు చేస్తారు. కానీ రఘు రామకృష్ణం రాజు మాత్రం పాపం జగన్ అమాయకుడు ఆయనకు ఏమీ తెలియదు అంటూ తీసి ఒక మూలన పెడుతున్నారు. దాని వల్ల జగన్ కి పాలన చేతకాదా, లేక జగన్ పేరు మీద ఎవరో అన్నీ చేస్తూంటే జగన్ కేవలం ఉత్సవ విగ్రహంగా ఉన్నారనుకోవాలా. ఏమైనా అనుకోండి మీ ఇష్టం అన్నట్లుగానే రఘు రామకృష్ణం రాజు తెలివిగానే బాణాలు వేస్తున్నారన్నదే వైసీపీ నేతల బాధ.నిజానికి ఒక పార్టీ తరఫున గెలిచిన ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ తాము అధినాయకత్వం మాటకు కట్టుబడి ఉంటారు. అయితే ఇక్కడ రఘు రామకృష్ణం రాజు ఏనాడో కట్టుతప్పారు, కానీ ఆయన అంతటితో ఊరుకోకుండా రోజుకో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. చివరికి పరిస్థితి ఎలా తయారైంది అంటే తాను బాధ్యతగా రాజీనామా చేయాలి, ఆ పని చేయకుండా దానికి కూడా కండిషన్లు పెడుతున్నారు. అమరావతి రాజధాని ఉంచుతానంటే తాను మళ్ళీ జనంలోకి వెళ్ళి నెగ్గి వస్తారట. మరి ఇదే వెటకారం రాజకీయం అంటే అని వైసీపీ నేతలు మండిపడుతున్నారంటే ఆలోచించాల్సిందేగా. ఇక జాతీయ మీడియాను అడ్డం పెట్టుకుని వైసీపీ సర్కార్ పరువుని నిలువునా ఢిల్లీలో తీస్తున్న రఘు రామకృష్ణం రాజు మీద జగన్ ఇంకా మూడవ కన్ను తెరవకపోవడం పట్ల సొంత పార్టీలోనే చర్చ సాగుతోందిట. ఏది ఏమైనా ఇప్పటికైతే రాజు వైసీపీ మీద, జగన్ మీద తన ఆధిపత్యాన్ని అలా కొనసాగిస్తున్నారు అనుకోవాలి