నెల్లూరు, సెప్టెంబర్ 15,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి గ్రామ, వార్డు వాలంటరీ వ్యవస్థ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. ఎన్నికల ముందే ఆయన తాను గెలిస్తే ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను పెడతానని, ప్రభుత్వ పథకాలన్నీ వారి ద్వారా నేరుగా ఇంటికే వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను పెట్టే వ్యవస్థ సాధ్యాసాధ్యాలపై అప్పట్లో అనేక అనుమానాలు వచ్చాయి. అయితే, ప్రజలు మాత్రం జగన్ హామీని నమ్మారనే ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించారు. లక్షలాధి మంది యువతకు ఒక ఉపాధి దొరికింది. రూ.5 వేల గౌరవ వేతనంగా వారికి ప్రభుత్వం చెల్లిస్తోంది. స్వగ్రామంలో పని చేసుకునే అవకాశం కావడం, నిరుద్యోగులుగా ఉండటం కంటే వాలంటర్‌గా పని చేయడం మంచిదనే భావనతో ఈ ఉద్యోగాలు చేయడానికి కూడా యువతీయువకులు మొగ్గు చూపారు. దీంతో జగన్ అనుకున్నట్లుగానే రాష్ట్రంలో ఏడాది క్రితం గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థ ప్రారంభమైంది.
ఈ వ్యవస్థను ప్రారంభించే ముందు తాను ఎందుకు ఈ ఆలోచన చేయాల్సి వచ్చిందో జగన్ చెప్పారు. ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ రెండుకళ్ల లాంటివన్నారు. గ్రామ వాలంటీర్లు సేవ చేస్తున్నట్లుగా భావించాలని చెప్పారు. జగన్ వ్యాఖ్యలు వాలంటీర్లలోనూ స్ఫూర్తి నింపాయి. వీరంతా ఏడాదిగా బాగా పనిచేస్తున్నారు. అక్కడక్కడా కొందరిపై విమర్శలు ఉన్నా నూటికి తొంభై శాతం మంది ప్రజల్లో వాలంటీర్‌లు బాగా పని చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రభుత్వ పథకాలను ఇంటికి తీసుకెళ్లి లబ్ధిదారులకు అందించడంలో, కరోనా, వరదల వంటి కష్టకాలంలో వాలంటీర్లు ప్రభుత్వం తరపున ప్రజలకు అండగా ఉంటున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. జగన్ ఆలోచనలు కూడా బాగానే కార్యరూపం దాల్చింది. అయితే, స్వంత పార్టీ క్యాడర్ నుంచి జగన్ మానసపుత్రిక లాంటి వాలంటీర్ వ్యవస్థకు తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇంతకుముందు గ్రామాల్లో వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, పథకాల అమలులో అధికార పార్టీ క్యాడర్ జోక్యం ఎక్కువగా ఉండేది.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల రూపంలో ఉన్న టీడీపీ నేతలు జోక్యం చేసుకునే వారు. గ్రామాల్లో ఉండే రాజకీయ వైరం కారణంగా సహజంగానే ప్రత్యర్థి పార్టీల వారికి పథకాల అమలులో మొండిచేయి చూపేవారు. దీంతో సహజంగానే తమ పార్టీ అధికారంలోకి వచ్చాక తమ పెత్తనం నడుస్తుందని, అప్పుడు వారి సంగతి చెప్పాలనే భావన ఉంటుంది. గతంలో అధికార పార్టీ క్యాడర్ హవా నడిచినట్లుగానే తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక తమ చేతుల్లోనే ఉంటుందని వైసీపీ క్యాడర్ ఆశించింది.కానీ, జగన్ తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థతో ఇలా కుదరడం లేదు. కులం, మతం, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలనే జగన్ ఆదేశాలకు అనుగుణంగా వాలంటీర్లు పని చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో వైసీపీ క్యాడర్ చెప్పినట్లుగా జరగడం లేదు. ప్రత్యర్థి పార్టీల వారికి, గతంలో తమను ఇబ్బంది పెట్టిన వారికి కూడా పథకాలు అందుతున్నాయి. దీంతో వైసీపీ క్యాడర్‌లో అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని వాలంటీర్లపై చూపిస్తున్నారు. రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒక చోట వాలంటీర్లపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు.ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో పదేపదే జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనల వల్ల కేవలం 5 వేల గౌరవ వేతనం తీసుకొని పని చేస్తున్న వాలంటీర్ల మానసిక స్థైర్యం దెబ్బతింటోంది. ఇప్పటికే వాలంటీర్లను చిన్నచూపు చూసేలా కొన్ని పార్టీలు ప్రచారం చేశాయి. అయినా కూడా తాము చేసే పని పట్ల నిబద్ధతగా వాలంటీర్లు పని చేస్తున్నారు. ఇటువంటి వారికి వైసీపీ వారి నుంచే సమస్యలు మొదలుకావడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా స్పందించి తన క్యాడర్‌ను అదుపు చేయకపోతే భవిష్యత్‌లో తను వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందుకోవాల్సిన ఫలితాలు దూరమయ్యే అవకాశం ఉం