న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 15,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. రాష్ట్రంలోని 13 నగరాల్లో కాలుష్యం చాలా ఎక్కువగా ఉన్నదని.. అక్కడ గాలి కేవలం కొద్దిశాతం మాత్రమే స్వచ్ఛంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించుకొనేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు.. కేంద్ర పర్యావరణశాఖ మంత్రి బాబుల్ సుప్రియో లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. 2014 నుంచి 18 వరకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న కాలుష్యంపై అధ్యయనం చేసిందని మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనంతపురం, చిత్తూరు, ఏలూరు. గుంటూరు. కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో స్వచ్ఛమైన గాలి నాణ్యత అత్యల్పంగా ఉన్నట్లు గుర్తించామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్కాప్) కింద కాలుష్యం బారిన పడిన నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. వాహనకాలుష్యం. రోడ్లపై చెత్తను తగులబెట్టడం. పారిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్లే నగరాలు పాడైపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏం చేయాలనే విషయంపై విదేశీ సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నట్టు చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు అవలంభిస్తున్న విధానాలను గురించి అధ్యయనం చేస్తున్నామని బాబుల్ సుప్రియో వివరించారు.అలాగే జల్ జీవన్ మిషన్ (జేజేఎం) కింద 2024 నాటికి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు అందించాలని కేంద్రప్రభుత్వం యోచిస్తున్నదని చెప్పారు. 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 63.72 లక్షల గృహసముదాయాలకు నల్లా కనెక్షన్లు ఇస్తామన్నారు. మొదటి ఫేజ్లో గ్రామీణప్రాంతాలకు కుళాయి ఇస్తామని.. రెండో ఫేజ్లో పట్టణప్రాంతాల్లో కుళాయి సమకూరుస్తామని చెప్పారు. ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు జలశక్తిశాఖ సహాయమంత్రి రతన్లాల్ కటారియా ఈ సమాధానం చెప్పారు.