విజయనగరం, సెప్టెంబర్ 16,
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడే ప్రయత్నం చేస్తుంది. జరుగుతున్న సంఘటనలకు తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తుంది. అంతర్వేది సంఘటనను బీజేపీ ఫుల్లుగా వాడేసుకుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే హిందుత్వంపై దాడులు పెరుగుతున్నాయన్న ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అదే సమయంలో గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా వదలడం లేదు. కృష్ణా పుష్కరాల సందర్భంగా దేవాలయాల ధ్వంసాన్ని చేసిన వైనాన్ని కూడా బీజేపీ ఎండగడుతోంది.ఇక సోము వీర్రాజు 2024లో తాము జనసేన కలసి అధికారంలోకి వస్తామని పదే పదే చెబుతున్నారు. ప్రస్తుతం కాపు సామాజిక వర్గం బీజేపీకి అండగా ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. జనసేన కలవడంతో కాపు ఓటు బ్యాంకు గంపగుత్తగా తమకే వస్తుందన్న ఆశలో కమలనాధులు ఉన్నారు. దీనికి తోడు కమ్మ, బీసీ కులాలను కూడా మంచి చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి కీలక పదవి లభిస్తుందని చెబుతున్నారు.జనసేనకు గత ఎన్నికల్లో ఆరు శాతం వరకూ ఓట్లు వచ్చాయి. ఈ సారి ఆ సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో జనసేన ప్రభావం ఈసారి ఎక్కువగా ఉంటుందని బీజేపీ అంచనా వేస్తుంది. టీడీపీని బలహీనపర్చగలిగితేనే తాము రెండోస్థానంలోకైనా వస్తామని రామ్ నాథ్ చేసిన వ్యాఖ్యలు నిజం చేసే పనిలో పడ్డారు బీజేపీ నేతలు. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీకి బీ టీమ్ గా ముద్రపడటంతో బీజీేపీ ఏపీలో ఎక్కిరాలేకపోయింది. అందుకే టీడీపీ ని పూర్తిగా ఇబ్బంది పెట్టే పనిలో ఉన్నారు.ఇందుకు ఒడిశా ఫార్ములాను ప్రయోగించనున్నారు. అక్కడ కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసి బీజేపీ ప్రతిపక్ష స్థానంలోకి వచ్చింది. ఇదే ఫార్ములాను ఏపీలోనూ ఉపయోగించాలనుకుంటున్నారు. అందుకే బీసీ, కమ్మలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయించారు. అందుకే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే నేతల నోళ్లను ఇప్పటికే నొక్కేశారు. భవిష్యత్ లో బీజేపీలో కమ్మ, బీసీలకే ఎక్కువ పదవులు దక్కుతాయన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద బీజేపీ ఏపీలో ఒడిశా ఫార్ములాను అమలు చేయాలని నిర్ణయించింది. మరి ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.