అనంతపురం, సెప్టెంబర్ 16,
అనంతపురం జిల్లా వైసీపీ రాజకీయాలు గతంలో టీడీపీని మించిపోయి నడుస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. గతంలో టీడీపీ నేతలు ఇక్కడ కొందరు ఏకఛత్రాధిపత్యంతో ముందుకు నడిచారు. ప్రభుత్వం తమదే కావడంతో నాయకులు ఎవరికి వారే విజృంభించారు. ఎవరికి వారే పైచేయి సాధించేందుకు ప్రయత్నించారు. ఎక్కడికక్కడ గ్రూపులు కట్టారు. ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించారు. మా నియోజకవర్గంలో మీరు వేలు పెట్టొద్దు.. మీ నియోజకవర్గంలో మేం వేలు పెట్టం.. అనే ధోరణిలో నాయకులు వ్యవహరించారు. దీంతో టీడీపీ ఎంతో బలంగా ఉందనుకున్న జిల్లాలో గత ఎన్నికల్లో దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. పార్టీ కంచుకోట హిందూపురంలో బాలకృష్ణ రెండోసారి గెలవగా.. ఉరవకొండలో మాత్రం సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఈ రెండు సీట్లు మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ, ఎంపీ సీట్లను వైసీపీ క్వీన్‌స్వీప్ చేసేసింది.ఇక, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు కూడా నాడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలను మించేలా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ గ్రూపులు కట్టే వారు కొందరు ఉంటే.. మరికొందరు ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నవారు ఉన్నారు. ఇంకొందరు మా కెందుకులే అనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. రెండు ఎంపీ నియోజకవర్గాల్లోనూ ఎంపీలు వైసీపీకి చెందిన వారే. అయితే, ఈ ఇద్దరూకూడా కలివిడిగా లేకపోగా.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేయడం వివాదాలకు మరింత కారణంగా మారింది. హిందూపురం ఎమ్మెల్యే గోరంట్ల మాధవ్‌పై ఇటీవల కాలంలో ఆరోపణలు పెరిగిపోయాయి. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆధిపత్య రాజకీయాలు చేస్తున్నారని ఆయనపై స్థానిక నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు.పోనీ.. స్థానిక ఎమ్మెల్యేలతో వైసీపీ ఎంపీ కలిసి పనిచేస్తున్నారా ? అంటే .. అది కూడా లేదు. కేవలం జేసీ కుటుంబాన్ని టార్గెట్ చేయడమే పనిగా ఆయన పనిచేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో హిందూపురంతో పాటు మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆయన వేలు పెడుతున్నారన్న టాక్ ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటే లక్ష్యంగా మాధవ్ తన గ్రూపును ప్రోత్సహిస్తున్నారన్న చర్చలు నడుస్తున్నాయి. ఫలితంగా ఆయా నియోజకవర్గాల్లో ఎంపీ వర్గం రైజ్ అవుతోంది. ఇదిలావుంటే, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య తనపనేదో తాను చేసుకుంటున్నా.. పార్టీ తరఫున నాయకుల సమస్యలు వినేందుకు ఆయన పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం కరోనా సమయంలోనూ ఆయన యాక్టివ్‌గా లేరనే వాదన వినిస్తోంది. పైగా పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ముందుకు రావడం లేదు. తన నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం లేదని ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన సమావేశంలో పార్టీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసే వరకు వెళ్లింది. ఈ పరిణామాలతో జిల్లాలో వైసీపీ రాజకీయం టీడీపీ నేతలను మించిపోయిందని అంటున్నారు పరిశీలకులు.