వాషింగ్టన్ సెప్టెంబర్ 16,
ఐక్యరాజ్యసమితి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ఇసోసాక్)లో మహిళ అభ్యన్నతి కోసం ఏర్పాటైన కమిషన్‌లో భారత్ సభ్యత్వం సాధించింది. కమిషన్ సభ్యత్వం కోసం జరిగిన ఓటింగ్‌లో చైనా చిత్తుగా ఓడిపోయింది. ఈ విషయాన్ని ఐక్యారాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి టీ ఎస్ తిరుమూర్తి తెలిపారు. ‘మహిళల అభ్యున్నతి కోసం ఏర్పాటైన ఇకోసాక్ కమిషన్‌లో భారత్ సభ్యత్వం గెలుచుకుంది. స్త్రీపురుష సమానత్వం, మహిళా అభ్యున్నతి కోసం భారత్ చేసిన కృషికి ఇది నిదర్శనం. మాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు.’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఈ కమిషన్ లో భారత్ 2021 నుంచి 2025 వరకూ కొనసాగనుంది.ఈ కమిషన్‌లో సభ్యత్వం కోసం భారత్‌తో పాటు చైనా, అఫ్ఘనిస్థాన్ కూడా పోటీపడ్డాయి. ఇందు కోసం జరిపిన ఎన్నికల్లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ గెలుపొందాయి. సభ్యుల మద్దతు రాబట్టలేక చైనా ఓడిపోయింది. ఈ కౌన్సిల్‌లో మొత్తం 54 ఓట్లు ఉండగా, సభ్యత్వం కోసం 28 ఓట్ల మెజారిటీ అవసరం. యూఎన్‌లో అడిలా రాజ్ నేతృత్వంలోని ఆఫ్ఘన్‌కు 39, భారత్‌కు 38 ఓట్లు లభించాయి. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనాకు కేవలం 27 ఓట్లు మాత్రమే లభించాయి. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి మాజీ అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్, యూఎన్ ఉమెన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మి పూరి ఎన్నికల్లో విజయానికి కారణమైన రాయబారి తిరుమూర్తిని అభినందించారు.