టోక్యో సెప్టెంబర్ 16
జపాన్ నూతన ప్రధానిగా యొషిహిడే సుగా ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంటులోని దిగువసభ అయిన నేషనల్ డైట్‌లో బుధవారం జరిగిన ఓటింగ్‌లో ఆయన గెలుపొందారు. ఈ విషయాన్ని జపాన్ పార్లమెంటు అధికారికంగా ప్రకటించింది. అనారోగ్య కారణాల రీత్యా మునుపటి ప్రధాని షింజో అబే ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను పార్లమెంటు ఆమోదించింది. ఈ నేపథ్యంలో అబేకు వారసుడిగా యొషిహిడే జపాన్ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు.కాగా, జపాన్ దిగువసభలో ఓటింగ్‌లో మొత్తం 462 మంది సభ్యులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. అందులో 314 ఓట్లు యొషిహిడేకు అనుకూలంగా పడ్డాయి. నేషనల్ డైట్‌లో అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ)కి మెజారిటీ ఉండటంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయ్యింది. ఓటింగ్‌లో యొషిహిడే గెలుపొందినట్లు స్పీకర్ తడమొరి ఒషిమా ప్రకటించారు. దీంతో సుమారు ఎనిమిదేండ్ల తర్వాత జపాన్‌కు కొత్త ప్రధాని ఎన్నికయినట్లు అయ్యింది.